74ఏళ్ల వయస్సులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతుంటే విమర్శలు చేయడానికి మనసెలా వచ్చిందని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే జగన్ ఎప్పుడో లండన్ వెళ్ళిపోయేవారని, ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతూ పనిగట్టుకొని ప్రభుత్వంపై చిల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న జగన్ కు ఆ హుందాతనం ఉందా? ఈ కష్టకాలంలో బాధ్యత కల్గిన నాయకులు ఇలాగే వ్యవహరిస్తారా.? అని ప్రశ్నించారు. విపత్తులు వచ్చినప్పుడు సొంత ఖర్చుతో బాధితులకు ఆహార సరఫరా చేసిన చరిత్ర జగన్ కు లేదన్న లోకేష్..ఆయన ప్రకటించిన సెల్ఫ్ చెక్ కథ అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
విజయవాడను మునిగిపోయేలా చేసిన బుడమేరు వాగు ఆధునీకరణకు టీడీపీ హయాంలో 464కోట్లు ఇచ్చి పనులు ప్రారంభిస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులను నిలిపివేసి ప్రస్తుత దిస్థితికి కారణం అయ్యారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు ఉప్పొంగడానికి ప్రధానంగా ఆయనే కారణమని ఆరోపించారు.
2022లోనే గండి పడినా పట్టించుకోలేదని.. వైసీపీ హయాంలో పట్టించుకోకుండా ఉండటంతోనే విజయవాడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. బాధితులందరిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు.