ప్రస్తుతం చంద్రబాబు సర్కారులో అత్యంత కీలకమైన కొద్ది మంత్రుల్లో నారాయణ ఒకరు. చంద్రబాబు మంత్రులకు ఇచ్చిన ర్యాంక్ లలో నారాయణకు చిట్టచివరి ర్యాంక్ వచ్చి ఉండచ్చు గానీ, వాస్తవానికి చంద్రబాబు తరవాత అంతగా చక్రం తిప్పుతున్న కొందరిలో అయన ఉన్నారు. అయితే ఆయనకు మాత్రం ఏపీ కోసం కావలసిన వాటిని పోరాడి సాధించుకోవడం అనే సిద్దాంతం మీద ఏ మాత్రం నమ్మకం లేనట్లుగా ఉంది. సామరస్యంగా ఉంటూ మనకు రావలసినది సాధించుకోవడం అనే సిద్ధాంతం విషయంలో చంద్రబాబు కంటే మంత్రి నారాయణ రెండాకులు ఎక్కువే చదివినట్లుగా ఉంది.
వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను మొత్తం నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. తొలివిడత గా సిబ్బందిని తరలించడానికి కూడా జూన్ 27ను ముహూర్తంగా అయన ఎన్నడో ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఒకసారి అదే విషయాన్ని ధృవీకరించారు. వెలగపూడి తరలడానికి ఉద్యోగులు గడువు పెంచాలని అడుగుతున్న నేపధ్యంలో అయన క్లారిటీ ఇచ్చారు. గడువు పెంచడం అంటూ జరిగితే మరో ఏడాది పడుతుందని తేల్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూన్ 27న 4000 మందిని తరాలిస్తాం అని చెప్పారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏపీ హక్కులకోసం పోరాటం మంచి మార్గం కాదని మంత్రి నారాయణ సెలవివ్వడం మరొక ఎత్తు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన ముందే కాడి పక్కన పారేస్తున్నారు. కేంద్రం హోదా ఇవ్వకపోతే గనుక, నిధులు ఎంత ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అయన ముందే వారికి మల్టిపుల్ ఛాయిస్ అందిస్తున్నారు. కేంద్రంతో గానీ, తెలంగాణతో గానీ పోరాడటం వల్ల ఉపయోగం ఎంత మాత్రం లేదని జగన్ తెలుసుకోవాలని నారాయణ పాఠం చెబుతున్నారు.
కేంద్రంతో సామరస్యం సరే, చివరికి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టేస్తోంటే, తెలంగాణ తో కూడా పోరాడకుండా సాధించడం గురించి నారాయణ చెబితే ఎలా? అయిన తెలంగాణ తో వైఖరి గురించి ఏపీ లోని మరొక మంత్రి చెబితే ఆ తీరు వేరు. నారాయణ చెబితే మాత్రం, ఆ రాష్ట్రంలోని తన కాలేజీ లను కాపాడుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని అంతా అనుకుంటారు.