ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ పై స్థానిక ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాల మేరకు దానిలో మార్పులు చేర్పులు చేసిన తరువాత మంత్రి నారాయణ సి.ఆర్.డి.ఏ. కార్యాలయంలో సోమవారం విడుదల చేసారు. దాని ప్రకారం అనంతవరం, నెక్కలు, శాఖమూరు, ఐనవోలు, మందడం, దొండపాడు, తుళ్ళూరు, రాయపూడి గ్రామాల మీదుగా సాగే ఐదు ఆర్టీరియల్ రోడ్ల మార్గాన్ని సుమారు 20-30 మీటర్లు పక్కకు జరిపారు. తద్వారా ఆయా గ్రామాలలో అనేకమంది రైతుల ఇళ్ళు తొలగించవలసిన అవసరం తప్పుతుంది. అలాగే ఎక్స్ ప్రెస్ హైవే అలైన్మెంటును కూడా కొద్దిగా మార్చడంతో దాని క్రిందకు వచ్చే కృష్ణాయపాలెం గ్రామానికి ఎటువంటి నష్టమూ జరగకుండా తప్పించబడింది. కృష్ణా కరకట్టలో కూడా లోతట్టు ప్రాంతాలను ఎత్తు పెంచేందుకు కరకట్ట డిజైన్ లో చిన్న మార్పు చేసారు. ఆ పరిధిలోకి వచ్చే కురగల్లు, ఐనవోలు గ్రామాల వద్ద రెండు ట్యాంక్ బండ్ లను అభివృద్ధి చేస్తారు. మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ పై కూడా వచ్చే నెలాఖరువరకు మళ్ళీ స్థానిక ప్రజల వద్ద నుండి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరించి తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసి మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.