తెదేపా ప్రభుత్వానికి, కాపునేత ముద్రగడ పద్మనాభానికి మధ్య మళ్ళీ యుద్ధం క్రమంగా తీవ్రం అవుతున్నట్లే ఉంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సవాలు చేస్తూ లేఖ వ్రాయడం ఆ తరువాత, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, దాసరి నారాయణ రావు, చిరంజీవి తదితరులను వరుసగా కలుస్తూ వారి మద్దతు కోరుతూ వారి చేతనే కాపులకు రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. మరోపక్క తెదేపా నేతలు మహానాడు వేదికగా చేసుకొని ముద్రగడ, ఆయనకీ మద్దతు ఇస్తున్న వారిపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ప్రకటించడానికి ఆగస్టు వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తామని, ఇంకా జాప్యం చేయాలని చూస్తే తాను మళ్ళీ దీక్షకి కూర్చోన్తానని ముద్రగడ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఆయనకి మంత్రి నారాయణ బదులిస్తూ, “ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలు అమలుచేస్తోంది. రిజర్వేషన్లపై వారికి ఇచ్చిన నిలబెట్టుకొనడానికి సిద్ధంగా ఉంది. అయినా ముద్రగడ ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నారు? జగన్ మొదట దాసరిని కలిసి ఉద్యమానికి ప్రోత్సహించారు కానీ ఆయన కాదనడంతో ముద్రగడని కలిసి ఒప్పించారు. అందుకే ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మేము నమ్ముతున్నాము. తుని విద్వంసంలో ఎవరెవరి హస్తం ఉందనే విషయం బయటపడుతుందనగానే, ఆ సమస్య నుంచి బయటపడటానికే ముద్రగడ మళ్ళీ హడావుడి చేస్తున్నారని అనుమానిస్తున్నాము,” అని అన్నారు.
చిరంజీవిపై కూడా విమర్శలు గుప్పిస్తూ “కాపుల సంక్షేమం గురించి ఇప్పుడు గొంతు చించుకొని మాట్లాడుతున్న చిరంజీవి, దాసరి నారాయణ రావు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పుడు వారి కోసం ఏమి చేసారు? ఏనాడైనా కనీసం వారి గురించి ఆలోచించారా? చిరంజీవి తమని ఏదో ఉద్దరిస్తారనే ఆశతో కాపులు అందరూ ఆయనకి ఓటేస్తే చివరికి ఏమి చేసారు? తన పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, తనను నమ్మిన వారినందరినీ నట్టేట ముంచేశారు. ఇప్పుడు అయన కాపుల సంక్షేమం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని మంత్రి నారాయణ విమర్శించారు.
ఒక సమస్యని పరిష్కరించవలసిన అధికార పార్టీ ఒకవైపు, ముద్రగడ, ప్రతిపక్షాలు మరోవైపు నిలిచి ఈవిధంగా రాజకీయ చదరంగం ఆడుకొంటుంటే అది పరిష్కారం కాదు సరికదా ఇంకా కొత్త సమస్యలు పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.