ఏపీ రాజధాని అమరావతికి భవిష్యత్ లో వరద ముప్పు ఉందా? విజయవాడకు వచ్చినట్లే అమరావతికి వరదలు వస్తాయా? మొన్నటి వరదలకు అమరావతి వరద నీటిలో మునిగి పోయిందా? బయట జరుగుతున్న ప్రచారం, వైసీపీ సృష్టిస్తున్న అపోహాలపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు.
అమరావతికి ఎలాంటి వరద ముప్పు లేదని, అదంతా ప్రచారమేనని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎంత వరద వచ్చినా అమరావతికి ఇబ్బంది లేకుండా వరద కాలువల డిజైన్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, వచ్చే వర్షకాలం వరకు ఇవి పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. ఉండవల్లి వద్ద 12,350క్యూసెక్కులు, బకింగ్ హామ్ కెనాల్ వద్ద 4వేల క్యూసెక్కులు, వైకుంఠాపురం వద్ద 5,650క్యూసెక్కుల వరద పోయేలా ప్రణాళికలున్నాయని… ఈ పనులు పూర్తైతే వరద భయమే ఉండదని మంత్రి తెలిపారు.
మొత్తం ఆరు రిజర్వాయర్లు ప్లాన్ చేశామని… వైకుంఠాపురం, కృష్ణాయపాలెం, శాఖమూరు, నీరుకొండ, లామ్ వద్ద ఈ రిజర్వాయర్లు నిర్మిస్తే వరదతో అమరావతికి ఆటంకాలు తీరబోతున్నాయి. కావాలని చేస్తున్న విష ప్రచారాలు నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.