విదేశీ వ్యవహార శాఖ సహాయమంత్రిగా చేస్తున్న వికె సింగ్ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ జిల్లాలో ఒక దళిత కుటుంబంపై అగ్రవర్ణానికి చెందిన కొందరు చేసిన దాడిలో ఇద్దరు దళిత బాలలు సజీవ దహనం అయ్యారు. దానిపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ మరొక దళిత బాలుడు పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ సంఘటనలపై వికె సింగ్ స్పందిస్తూ, “ప్రతీ స్థానిక సంఘటనను కేంద్రప్రభుత్వంతో ముడిపెట్టకూడదు. ఆ సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులు తగిన చర్యలు తీసుకొంటాయి. ఎవరో ఎక్కడో ఒక కుక్కను కొట్టినా దానికీ కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అంటారు. అది సరికాదు. ఉత్తరభారత దేశ ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడాన్ని చాలా గర్వంగా భావిస్తారు..దానిని ఆస్వాదిస్తారని డిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ అన్న మాటలతో నేను ఏకీభవిస్తున్నాను,” అని అన్నారు.
ఆయనపై కేసు నమోదు చేయవలసిందిగా షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్లను ఆదేశించింది.
అభం శుభం తెలియని దళితబాలలను అత్యంత పాశవికంగా కొందరు సజీవ దహనం చేస్తే దానిని కుక్కను రాయితో కొట్టిన సంఘటనతో వికె సింగ్ పోల్చడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల పట్ల అంత చులకన భావం ఉన్న అటువంటి వ్యక్తి కేంద్రమంత్రిగా చేయడానికి అనర్హుడని కనుక ఆయనని తక్షణమే పదవిలో నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.
కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకు ముందు గుజరాత్ మత ఘర్షణలలో మరణించిన వారిపట్ల నరేంద్ర మోడీ ఇదే విధంగా స్పందించారు. ఆ అల్లర్లలో చనిపోయిన వారిని ఆయన కారు క్రింద పడి నలిగిచనిపోయిన కుక్క పిల్లతో పోలిస్తే, ఇప్పుడు ఆయన మంత్రి వికె సింగ్ దళిత బాలలు చనిపోవడాన్ని కుక్క మీద రాయి విసిరినంత చిన్న సంఘటనగా పేర్కొంటున్నారు. దళితులపై మోడీకి ఎటువంటి చులకన భావం ఉందో ఆయన మంత్రులకు అటువంటి చులకనభావమే ఉందని అర్ధం అవుతోంది. వికె సింగ్ ని తక్షణమే పదవిలో తప్పించాలి,” అని అన్నారు.
తను చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వికె సింగ్ మరొక సవరణ ప్రకటన చేసారు. “దళిత చిన్నారుల హత్య పిరికిపంద చర్య. అది మన సమాజపు దిగ్భ్రాంతికర పరిస్థితులకి అద్దంపడుతోంది. ఎవరో కొందరు మానసిక రోగులు చేసిన పనికి ప్రభుత్వాన్ని నిందించరాదని చెప్పడమే నా మాటల ఉద్దేశ్యం తప్ప దళితుల పట్ల చులకన భావం నాకు లేదు. నా మాటలను వక్రీకరించరాదని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.