కేంద్రంలో టీడీపీ మరోసారి చక్రం తిప్పబోతుంది. 20 ఏళ్ల తర్వాత చంద్రబాబు కింగ్ మేకర్ గా కేంద్ర రాజకీయాలను శాసించే అవకాశం లభించింది. ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని ప్రకటించిన చంద్రబాబు, ఆంధ్రా ప్రయోజనాల విషయంలో రాజీపడరన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, జాతీయ మీడియా కథనాల ప్రకారం… చంద్రబాబును ఇండియా కూటమి వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, బాబు ఎన్డీయేలోనే ఉంటారని… కనీసం 7 కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కీలకమైన రోడ్లు, గ్రామీణాభివృద్ధి వంటి మంత్రిత్వ శాఖలను చంద్రబాబు టీడీపీకి ఇవ్వాలని కోరబోతున్నారని, బీజేపీకి అవసరం కాబట్టి… మంచి శాఖలే ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. గతంలో ఏపీకి నిధుల విషయంలో కేంద్రం వద్ద ఎన్నో ప్రతిపాదనలు పెట్టినా పనులు జరగలేదని… కానీ ఇప్పుడు ఏపీకి అన్ని రకాలుగా న్యాయం జరగబోతుందని జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.
అంతేకాదు లోక్ సభలో స్పీకర్ పోస్టును కూడా టీడీపీ కోరుతుందని… జలవనరుల శాఖపై కూడా టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉందని, సాయంత్రం ఎన్డీయే మీటింగ్ తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపింది. గతంలో ఎన్డీయే కూటమి తరఫున టీడీపీ ఎంపీ స్పీకర్ గా పనిచేశారని, ఇప్పుడు కూడా తీసుకుంటారని జాతీయ మీడియా కథనం.