గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో నారా లోకేష్ భంగపడిన తరువాత, ఆయన రాజకీయ భవిష్యత్ గురించి మీడియాలో చాలా చర్చ జరిగింది. పార్టీలో కొందరు సీనియర్లు ఆయనను సుజానాచౌదరి స్థానంలో రాజ్యసభకు పంపించి కేంద్రమంత్రిగా చేస్తే బాగుంటుందని, ఆలా చేయడం మంచిది కాదని మరికొందరు అభిప్రాయలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చేయి.
అవి నిరాధారమయినవి కావని నిరూపిస్తూ “నేను ఇప్పుడే డిల్లీకి వెళ్ళదలచుకోలేదు. రాష్ట్రంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి,” అని నారా లోకేష్ స్వయంగా ప్రకటించేరు. అంటే లోకేష్ రాష్ట్రంలో పార్టీ కోసం కానీ ప్రభుత్వంలో గానీ పనిచేయవచ్చనే సంగతి స్పష్టమయింది. ఇటీవల కడప జిల్లా పర్యటించి అక్కడ తెదేపాను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలంగానే ఉంది పైగా దాని బాగోగులు చూసుకోవడానికి ఒక జాతీయ అధ్యక్షుడు(చంద్రబాబు నాయుడు), ఒక రాష్ట్ర అధ్యక్షుడు (కళా వెంకటరావు), పార్టీలో అనేకమంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు కనుక దాని కోసం లోకేష్ కొత్తగా చేయవలసిందేమీ లేదనే చెప్పవచ్చును.
లోకేష్ రాజకీయ భవిష్యత్ కి ఇప్పటి నుంచి గట్టి పునాదులు వేయకపోతే వచ్చే ఎన్నికల తరువాత, ఆయనది కూడా రాహుల్ గాంధి పరిస్థితే అవుతుంది. కనుక త్వరలోనే లోకేష్ ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయనకి భారీ పరిశ్రమలు, విద్యుత్ శాఖలను కట్టబెట్టవచ్చని ఒక మంత్రి మీడియా ప్రతినిదులకి చెప్పినట్లు తెలుస్తోంది. అది నిజం కావచ్చు కాకపోవచ్చును. ఎందుకంటే లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం అటువంటి బలమయిన నిర్ణయమేదో తీసుకోవడం అత్యవసరమే. కానీ అతనికి మంత్రి పదవి ఇవ్వొచ్చా లేదా… ఇస్తే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా ఏవిధంగా స్పందిస్తాయి? అని తెలుసుకోవడానికే ఈవిధంగా మంత్రి ద్వారా మీడియాకి ఈ వార్త లీక్ చేసి ఉండవచ్చును.
ఏమయినప్పటికీ, లోకేష్ ని ఇప్పుడు మంత్రి పదవిలోకి తీసుకొన్నట్లయితే, చంద్రబాబు నాయుడు స్వయంగా అతనికి అవసరమయిన మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన ఈ మూడేళ్ళలో లోకేష్ తన మంత్రిత్వ శాఖలను సమర్ధంగా నిర్వహించి చూపించగలిగితే, వచ్చే ఎన్నికలలో అది ఆయనకి, పార్టీకి కూడా చాలా కలిసి వస్తుందని పార్టీలో కొందరు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సూచిస్తున్నారు.
గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని పాలించినపుడు రాహుల్ గాంధికి ప్రధానమంత్రి పదవి అధిష్టించే మంచి అవకాశం ఉన్నప్పటికీ దానిని చేపట్టడానికి భయపడి ఒక సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా చాలా భయపడ్డారు. కానీ నారా లోకేష్ దైర్యంగా ముందుకు వచ్చి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించారు. అయితే ఆ ఎన్నికలలో ఓడిపోవడం వేరే సంగతి. ఇప్పుడు అవకాశం ఇస్తే మంత్రి పదవి కూడా చేపట్టి తన సమర్ధత నిరూపించుకోగలరని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ‘డాడ్ చంద్రబాబు నాయుడు’ కూడా అదే కోరుకొంటున్నారు కనుక త్వరలోనే నారా లోకేష్ పేరు ముందు ‘మంత్రి’ అనే పధం వచ్చి చేరుతుందేమో చూడాలి. ఉగాదికి ముందు లేదా ఆ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చాలా కాలంగా మంత్రి పదవి వీలయితే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న బాలయ్య బాబుకి ఏమిస్తారో చూడాలి.