ఏపిలో ప్రతిపక్షాలు..ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిత్యం చేసే ఆరోపణ ఏమిటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాజపాతో పొత్తుల కోసమో లేక కేసులకు భయపడో ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేయడం లేదని! ఈ విషయంలో తెదేపా, భాజపాలు రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్, వామ పక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాటి ఆరోపణలను ఖండించారు. గత రెండేళ్ళుగా ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల అమలుకి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నారని అన్నారు. ఆ హామీలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్రానిదేనని, అది తన మాటను నిలబెట్టుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతఃరాలు వస్తాయనుకొంటే కేంద్రం ఏపిని ప్రత్యేక రాష్ట్రంగా చూసినా పరువాలేదు కానీ ప్రత్యేక హోదా ద్వారా దక్కవలసినవన్నీ ఇవ్వాలని కోరారు.
ఒక్క ప్రత్యేక హోదాయే కాదు…అన్ని హామీలను అమలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానిని కలిసి పదేపదే విజ్ఞప్తి చేస్తుండటం అందరికీ తెలుసు. అది ఎంత వస్తావమో, హోదా రాదనే విషయం ఆయనకి చాలా కాలం క్రితమే తెలుసన్న మాట కూడా అంతే వాస్తవం. కారణాలు ఏవయినప్పటికీ, ఆయన కేంద్రంపై వాటి కోసం గట్టిగ ఒత్తిడి చేసి సాధించుకొనే ప్రయత్నం చేయలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కారణాల చేత హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీలను అమలు చేయకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటున్న మాట నూటికి నూరు శాతం వాస్తవం. అయితే ఆ హామీలను అమలుచేయలేమని ప్రజలకు చెప్పడానికి కేంద్రం రెండేళ్ళ సమయం తీసుకోవడం, ఏపి ప్రభుత్వం ఆ విషయం దాచి పుచ్చడం వలన వాటి విశ్వసనీయత దెబ్బతింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకందుకు వాటిని దాచిపెడితే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు దానిని మరొకందుకు వాడుకొన్నాయి. మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేసాయని చెప్పకతప్పదు. వామపక్షాలు ఒక్కటే ఈ విషయంపై పారదర్శకంగా వ్యవహరించాయని చెప్పవచ్చు. అవి రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటాయి. అలాగే ఈ ప్రత్యేక హామీ అంశం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూడకుండా నిజాయితీగా దాని కోసమే పోరాడాయి. కానీ బలహీనమయిన వాటి గొంతు ఎవరికీ వినపడలేదు. వినపడినా పట్టించుకొనే వాళ్ళే లేరు.