మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని, వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
మూసీ రివర్ ఫ్రంట్ కార్పోరేషన్ తెచ్చింది బీఆర్ఎస్ నేనని.. 2017లోనే కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు శ్రీధర్ బాబు వివరించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులు మరిచిపోయినట్టు ఉన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దులను ఫిక్స్ చేశారని చెప్పారు. మూసీ నిర్వాసితుల ఇబ్బందులను కొందరు కావాలనే జటిలం చేస్తున్నారని విమర్శించారు.
పేదలు, మధ్య తరగతి సంక్షేమమే మా ప్రభుత్వ లక్షం అని పేర్కొన్నారు శ్రీధర్ బాబు. మూసీ నిర్వాసితులను ఒప్పించి, మెప్పించే అక్కడి నుంచి తరలిస్తామని స్పష్టం చేశారు. మూసీని కాలుష్యరహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. విశ్వనగరం అని పేరులోనే కాకుండా కార్యాచరణ చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోందన్న శ్రీధర్ బాబు.. మూసీ నిర్వాసితులకు ఉపాధి కూడా కల్పిస్తామన్నారు.