జి.హెచ్.యం.సి.పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను తెలంగాణా ప్రభుత్వం తొలగిస్తోందంటూ తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేసాయి. మూడు పార్టీలు తెలంగాణా ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ధర్నాలు చేస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఏవో కుంటి సాకులు చూపిస్తూ సుమారు 25లక్షల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించిందని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకేసారి మూడు పార్టీలు ఒకే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకేసారి ఇన్ని లక్షల మంది ఓటర్లను బోగస్ ఓటర్లని ముద్రవేసి వారి పేర్లను జాబితా నుండి తొలగిస్తుండటంతో ప్రజలు కూడా ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నారు. ఓటర్లను తొలగించడం వలన కలిగే లాభం కంటే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణల వలన తెరాస ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతోంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. “ప్రతిపక్షాలు ప్రజలను తప్పు ద్రోవ పట్టించేందుకే దీనిపై అనవసరమయిన రాద్దాంతం చేస్తున్నాయి. కానీ అవి చెపుతున్నట్లు మా ప్రభుత్వం అన్ని లక్షల ఓట్లను తొలగించడం లేదు. నా సనత్ నగర్ నియోజక వర్గం నుండి వేలాది ఓటర్లపేర్లను తొలగించమని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. ఒకవేళ తొలగించి ఉండి ఉంటే ప్రజలు మమ్మల్ని నిలదీసేవారు కదా? ప్రజలెవ్వరూ పిర్యాదులు చేయకపోయినా ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. అసలు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోరాటాలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. వారిది చాలా అపవిత్రమయిన కలయిక. వారు ప్రజలను మభ్య పెట్టేందుకే రాద్దాంతం చేస్తున్నారు,” అని అన్నారు.
కానీ తెరాసకు అధికార గెజెట్ పత్రం వంటి సాక్షి మీడియాలో రెండు రోజుల క్రితం ప్రచురితమయిన ఒక కధనంలో జి.హెచ్.యం.సి. పరిధిలో నుండి మొత్తం 27, 12,468 ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రభుత్వం సిద్దం అయిందని తెలియజేసింది. కనుక తలసాని చెపుతున్న మాటలు వాస్తవం కాదని స్పష్టం అవుతోంది. ఇక ఒకే అంశంపై కాంగ్రెస్, తెదేపాలు పోరాడటం అనైతికం, అపవిత్రం అని తలసాని చెప్పడం చాలా హాస్యాస్పదం. పదవులకి ఆశపడి తెరాసలో చేరిన తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలతో తెరాస నిండి పోయిందిప్పుడు. కాంగ్రెస్, తెదేపా పార్టీలు తెలంగాణాని దోచుకొన్నాయని తెరాస అధినేత కేసీఆర్ ఆరోపించేవారు. తెలంగాణాలో అన్ని సమస్యలకు ఆ రెండు పార్టీలే కారణమని తెరాస నేతలు అందరూ నేటికీ వాదిస్తుంటారు. వారి కబంధ హస్తాల నుండి విముక్తి చేయడానికే తను పోరాడి తెలంగాణా సాధించానని చెప్పుకొంటారు.
కానీ కేసీఆర్ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని అదే పార్టీల నేతలకి అప్పగించారు. తెరాస ప్రభుత్వంలో తెలంగాణా కోసం పోరాడినవారి కంటే కాంగ్రెస్, తెదేపా నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్, తెదేపా నేతలు ఒకే అంశంపై పోరాడటం అనైతికం, అపవిత్రం అనుకొంటే మరి తెలంగాణాని దోచుకొన్న ఆ రెండు పార్టీల నేతలతో కలిసి తెరాస రాజ్యం చేయడాన్ని ఏమనుకోవాలి? తలసాని చెపితే బాగుంటుంది. తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని నేటికీ తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగడం నైతికమా కాదో ముందు చెప్పిన తరువాత ఇతరులకు సుద్దులు చెపితే ఇంకా బాగుంటుంది.