హైవపర్ కమిటీ మూడో సారి భేటీ అయి.. రాజధాని తరలింపు ప్రక్రియ పై మరోసారి చర్చలు జరిపింది. ప్రత్యేకమైన నిర్ణయాలేమీ తీసుకోలేదు కానీ పదిహేడో తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకుంది. అయితే.. ఈ భేటీ కంటే ముందే మంత్రులు రాజధాని రైతులకు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లాంటి వ్యవహారం ప్రారంభించారు. మంత్రి బొత్స సత్యనారాయణ.. తమను రాజధాని రైతులు కలిశారని.. వారి బాధలు చెప్పుకున్నారని ప్రకటించారు. దీంతో.. మీడియా కూడా… ఈ వ్యవహారంపై ఆసక్తి చూపించింది. ఎంత మంది రైతులు కలిశారు..? ఎప్పుడు కలిశారు..? వారు ఏమి అడిగారో ..చెబుతారేమోనని చూశారు. కానీ తర్వాత బొత్స..ఇతర రైతులు కూడా వచ్చి తనను కలిసి.. వారి సమస్యలు చెప్పుకోవచ్చని.. స్టేట్మెంట్ ఇచ్చారు. హైపవర్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత మంత్రి పేర్ని నాని కూడా అదే చెప్పారు. రైతులు.. వారి ఆలోచనలను.. పదిహేడో తేదీ లోపు వచ్చి చెప్పాలని డెడ్ లైన్ పెట్టారు.
సీఆర్డీఏ కమిషనర్‌కు కానీ.. ఈమెయిల్ ద్వారా కానీ తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. రాజధాని తరలించడం ఖాయమని.. రైతులకు క్లారిటీ ఉందని.. పేర్ని నాని చెప్పుకొచ్చారు. రైతులు వ్యక్తిగతంగా కూడా కలుస్తున్నారని ప్రకటించారు. రైతులు.. తమను కలుస్తున్నారంటూ.. మంత్రులు ప్రచారం ప్రారంభించడం.. అంతా వ్యూహాత్మకమేని.. రైతుల్లో ఒకరిపై ఒకరి అనుమానం పెంచి.. వారిలో చీలిక తెచ్చేలా.. మంత్రులు రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు.. దీక్షా శిబిరాల నుంచి వస్తున్నాయి.
మంత్రులు కలిశామంటున్న రైతులను.. మీడియాతో ఎందుకు మాట్లాడించలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ… నిర్ణయం తీసుకుంటే..ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఆందోళనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత మంది రైతుల్ని.. ఉద్యమం నుంచి దూరం చేస్తే తమ పని సులువు అవుతుందని అంచనా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.