స్కూల్లో పిల్లలకు ర్యాంకులు రాకపోతే టీచర్ల, ఇంట్లో తల్లి తండ్రుల చేత చివాట్లు తప్పవు. కానీ ఏపిలో మంత్రులకు కూడా ఈ ర్యాంకుల బెడద తప్ప లేదు. ఇవ్వాళ్ళ విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ర్యాంకులు ప్రకటించారు. వారిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకి ఫస్ట్ ర్యాంక్ దక్కకగా, ముఖ్యమంత్రి తరువాత అంతటివాడని పేరు సంపాదించుకొన్న మునిసిపల్ శాఖా మంత్రి పి.నారాయణకి అందరి కంటే చిట్టచివరి స్థానం అంటే 18వ ర్యాంక్ ఇవ్వడం విశేషం. అంటే అందరి కంటే ఆయన పని తీరు చాలా ఘోరంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు భావించవచ్చు.
అది ఏ రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో తెలియదు కానీ నారాయణ విద్యాసంస్థలకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న నారాయణకి మంత్రివర్గంలో అందరి కంటే తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ గా ముద్ర పడింది.
మంత్రుల ర్యాంకుల వివరాలు వరుస క్రమంలో ఇలాగ ఉన్నాయి. నెంబర్ 1: మంత్రి పీతల సుజాత, దేవినేని ఉమా మహేశ్వర రావు-2, ప్రత్తిపాటి పుల్లారావు-3, డా. కామినేని శ్రీనివాస్-4, పరిటాల సునీత-5, రావెల కిషోర్ బాబు-6, అచ్చెం నాయుడు-7, గంటా శ్రీనివాస రావు-8, కొల్లు రవీంద్ర-9, అయ్యన్న పాత్రుడు-10, పల్లె రఘునాధ రెడ్డి-11, కిమిడి మృణాలిని-13, పి.నారాయణ-18వ ర్యాంక్ లభించింది.
రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ సమావేశంలో కూడా మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, నిర్లక్ష్యం వహించినవారిని పదవులలో నుంచి తప్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. త్వరలో మంత్రివర్గం ప్రక్షాళన జరుగుతుందని మంత్రులే స్వయంగా చెపుతున్న సమయంలో ముఖ్యమంత్రి వారికి ర్యాంకులు ప్రకటించడం యాదృచ్చికంగా చేసింది కాదని చెప్పవచ్చు. కనుక మంత్రులలో అందరి కంటే తక్కువ ర్యాంక్ లు వచ్చిన పి. నారాయణ, మృణాలిని తదితరులపై వేటు పడబోతోందేమో?
విశేషమేమిటంటే రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రిగా రాష్ట్రంలోని విద్యాసంస్థలను పర్యవేక్షిస్తున్న గంటా శ్రీనివాసరావుకి 7వ ర్యాంకు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డికి-11వ ర్యాంక్, అలాగే నారాయణ విద్యా సంస్థల అధినేత పి. నారాయణకి అందరి కంటే అతితక్కువ ర్యాంక్-18 లభించడం విచిత్రంగానే ఉంది.