తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో… కేబినెట్‌పై ప్రజలు చూపించిన ఆగ్రహంతోనే తేలిపోతుంది. సీఎం కాకుండా.. మరో ముగ్గురు మంత్రులు మాత్రమే.. అతి కష్టం మీద బయటపడ్డారు. మిగతా వాళ్లంతా.. పరాజయం పాలయ్యారు. చివరికి ముఖ్యమంత్రి తనయుడు కూడా.. పరాజయభారాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఏకంగా 19 మంది మంత్రులకు… ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు.
మంత్రుల్ని సాగనంపిన జనం..!
మంత్రుల ఓటమి.. మూడు ప్రాంతాల నుంచి సాగింది. ఎచ్చర్ల నుంచి కిమిడి కళా వెంకట్రావు, బొబ్బిలిలో సుజయ కృష్ణ రంగారావు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు… ఓడిపోయారు. మైలవరంలో దేవినేని ఉమ, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, తిరువూరులో జవహర్, వేమూరులో నక్కా ఆనందబాబు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, నెల్లూరు సిటీలో నారాయణ, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ… పరాజయం మూటగట్టుకున్నారు.
తప్పుకున్నా తప్పని పరాజయాలు..!
ఏపీ ఎన్నికల ఫలితాలు అనగానే.. అందరి దృష్టి మంగళగిరి మీదే కనిపించింది. ఎవరు విజయం సాధిస్తారు? ఎంత తేడాతో విక్టరీ కొడతారన్న చర్చ కౌంటింగ్‌కు ముందు నుంచీ వినిపించింది. హోరాహోరీగా సాగిన పోరులో… లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి పైచేయి సాధించారు. సాంకేతిక కారణాల వల్ల మంత్రి పదవికి రాజీమామా చేసిన కిడారి శ్రవణ్… అరకు నుంచి పోటీ చేశారు. అక్కడ కనీసం సానుభూతి పవనాలు కూడా లేవు. అసెంబ్లీ వదిలి పార్లమెంట్ బరిలో నిలిచిన మంత్రులకు కూడా చేదు అనుభవమే మిగిలింది. ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన శిద్ధా రాఘవరావు, కడప పార్లమెంట్ బరిలో ఉన్న ఆదినారాయణ రెడ్డి పరాజయం పాలయ్యారు. మంత్రి పరిటాల సునీత ఈసారి పోటీకి దూరంగా ఉండి.. తన కుమారుడిని ఎన్నికల బరిలో నిలిపారు. రాప్తాడు నుంచి పోటీలో నిలిచిన పరిటాల శ్రీరామ్‌కు కూడా చేదు అనుభవమే మిగిలింది.
అధికారం ఉందని ప్రజలపై సవారీ చేసిన ఫలితం..?
ఫ్యాన్ సుడిగాలికి ఎదురు నిలిచి గెలిచిన మంత్రులు ముగ్గురే ఉన్నారు. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, పెద్దాపురం నుంచి చినరాజప్ప, విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు పదివేల లోపు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. ప్రజలను పట్టించుకోకుండా.. పదవుల పేరుతో పెత్తనం చేయడం వల్లనే.,.. టీడీపీ నేతలు ప్రజలకు దూరమయినట్లుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక కారణాలతో పాటు… అధికార వ్యతిరేకత…. కూడా కారణం అవ్వడం వల్లనే ఈ స్థాయి పరాజయం.. టీడీపీకి ఎదురయింది.