మంత్రులందరూ గడపగడపకూ వెళ్లాల్సిందేనని మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ తన సహచరులను ఆదేశించి మూడు, నాలుగు రోజులు కాలేదు. అప్పుడే మంత్రులందరూ గడప గడపకూ వెళ్లకుండా కొత్త యాత్రకు ప్లాన్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులందరూ బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. ఈ రోజు సీఎం జగన్ ను కలిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేస్తారు. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ యాత్ర జరగనుంది. నాలుగు జిల్లాల్లో బహిరంగసభలు కూడా ఏర్పాటు చేస్తారు.
ఓ కార్యక్రమం నిర్వహిస్తూండాగనే… దానికి బ్రేక్ వేస్తూ మరో కార్యక్రమం నిర్వహించాలనుకోవడంపై వైసీపీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. గడప గడపకూ వెళ్తే్ నిరసనలు వ్యక్తమవుతున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు యాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటే బెటరని ఆలోచిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి బీసీ మంత్రులతో యాత్ర చేయించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే గడప గడపకూ వెళ్లాలని కార్యక్రమం పెట్టి మంత్రులకు ప్రత్యేక బాధ్యతలిచ్చిన తర్వాత దానికి బ్రేక్ చేసేలా కొత్త కార్యక్రమం రూపొందించడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
పైగా ఈ రూట్ మ్యాప్ షెడ్యూల్ కూడా విచిత్రంగానే ఉంది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు, మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న తర్వాత వ్యక్తిగత పర్యటనలో వారంవరకూ ఉంటారు. ఈ వారంలోనే మంత్రులెవరూ సీఎం అందుబాటులో లేరన్న కారణంగా ఇతర చాన్సులు తీసుకోకుండా అందర్నీ బిజీగా ఉంచే వ్యూహాన్ని ఈ యాత్ర ద్వారా అమలు చేస్తున్నారని అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులను మాత్రమే యాత్రకు పంపడం వెనుక సామాజిక న్యాయం ప్రచారం కూడా చేసుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా తమ పాలన కన్నా… కులాలకు పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది.