భూసేకరణ విషయంలో మంత్రులు మంత్రులు రావెల కిషోర్ బాబు, యనమల రామకృష్ణుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న తప్పు పట్టారు. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతుల నుండి బలవంతంగా వారి భూములు లాక్కొంటే, వారి జీవితాలు, వారి కుటుంబాల భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే రైతులు అంత ఆవేదన చెందుతున్నారు. కానీ మంత్రులు వారి ఆవేదనని రాద్దాంతంగా భావించడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా నిరసించారు. ఈరోజు అధికారంలో ఉన్న ఆ మంత్రులు వచ్చే ఎన్నికలలో ఓడిపోతే అప్పుడు వారు ఇచ్చిన హామీలను ఎవరు అమలు పరుస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలను సానుభూతితో అర్ధం చేసుకొని వారికి నష్టం కలగకుండా సమస్యని పరిష్కరించుకోమని పవన్ కళ్యాణ్ సూచించారు. అందుకోసం నిపుణులతో కూడిన ఒక కమిటీని వేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
కానీ మంత్రులు ప్రత్తిపాటి, రావెల, నారాయణ మళ్ళీ అదేవిధంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు 33, 000 ఎకరాలను చాలా ఆనందంగా ఇచ్చారు. మిగిలిన మూడు నాలుగు గ్రామాల రైతులు తమ భూములు ఇవ్వనంత మాత్రాన్న రాజధాని నిర్మాణం ఆపేయలేము. వారు ఇవ్వకుంటే భూసేకరణ చట్టం ఉపయోగించక తప్పదు,” అని హెచ్చరించారు.
మరో మంత్రి రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ “ఈ సమస్యను పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పరిష్కరిస్తే బాగుంటుంది కదా?” అని అన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ “భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తున్నప్పుడు భూసేకరణ చట్టం ఉపయోగించకుండా ఏవిధంగా ఈ ప్రక్రియ పూర్తి చేయగలము? తప్పనిసరి పరిస్థితుల్లోనే భూసేకరణ చట్టం ఉపయోగించవలసి వస్తోంది. వీలయితే పవన్ కళ్యాణ్ స్వయంగా రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి ప్రభుత్వానికి భూములు ఇప్పిస్తే బాగుంటుంది,” అని అన్నారు.
ఆ మూడు నాలుగు గ్రామాలలో రైతులు వైకాపాకి మద్దతు ఇస్తుండవచ్చును. కానీ అంతమాత్రాన్న వారు రైతులు కాకుండాపోరు. ప్రభుత్వం భూమిని గుంజుకొంటే వారు కుటుంబాలతో సహా రోడ్డున పడకుండా ఉండరు. కనుక వారి ఆవేదనని రాద్దాంతంగా మంత్రులు కొట్టిపడేస్తే వారికె కాదు ఎవరికయినా కోపం కలగడం సహజం. పవన్ కళ్యాణ్ కూడా అందుకే మంత్రులపై ఆగ్రహించారు. ప్రజల గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే తను కూడా వారి తరపున నిలబడి పోరాడుతానని మంత్రులను హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి కమిటీని వేయమని సూచించారు. ఆయన చేసిన సూచనను స్వీకరించకపోగా తిరిగి ఆయనపైనే విమర్శలు గుప్పించారు. మరి ‘ఆ నలుగురు’ సున్నితమయిన ఈ అంశంపై ముఖ్యమంత్రి అనుమతితోనే ఈవిధంగా మాట్లాడుతున్నారా లేక స్వతంత్రంగా మాట్లాడుతున్నారో తెలియదు కానీ భూసేకరణ కంటే వారి మాటల వలననే తెదేపాకు ఎక్కువ నష్టం కలిగే అవకాశం కనబడుతోంది.