వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలో తిరుగులేని నేత. ఆయన చెప్పిందే వేదం… ఆదేశించిందే శాసనం. అందుకే ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికి పదవులు ఇవ్వాలో.. ఎవర్ని తీసేయాలో చకచకా చేసేస్తారు. మండలిని రద్దు చేస్తున్నామని ఇద్దరు మంత్రుల్ని తీసేసినా.. మళ్లీ మండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నా.. ఆ మంత్రులు తాము బకరాలం అయ్యామని మనుసులో అనుకున్నారు కానీ బయటపడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లుగా కనిపిస్తోంది. రాజీనామా లేఖలు ఇచ్చిన మంత్రులు జగన్‌ను తమదైన శైలిలో రాజకీయంగా బెదిరిస్తున్నారు. అసంతృప్తి వాదులం అవుతామని సంకేతాలు పంపుతున్నారు.
సీఎం జగన్ అడిగారని రాజీనామా లేఖలు ఇచ్చేసిన మంత్రుల్లో అత్యధికులు తమకు మళ్లీ చోటు ఇవ్వాలని రకరకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కొంత మంది మంత్రులు సమావేశమై.. ఆ సమాచారాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేలా చేసుకున్నారు. అక్కడ్నుంచి ప్రారంభమైన మంత్రుల వ్యూహం రకరకాలుగా సాగుతోంది. జగన్‌ను నమ్ముకుని చంద్రబాబు, టీడీపీ నేతలు, పవన్‌పై బూతులతో విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడు మంత్రి పదవులు తీసేస్తే తమ గతేం కాను అనే సంకేతాలను పంపుతున్నారు. వారు హైదరాబాద్ వెళ్లిపోయి .. తాము అసంతృప్తికి గురయ్యామనే సంకేతాలను పంపుతున్నారు.
మరి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తే సరే లేకపోతే… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెబుతున్నారు. కొంత మంది గాలి జనార్ధన్ రెడ్డి వంటి జగన్ సన్నిహితుల ద్వారా మరికొంత మంది కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పరిస్థితి తేడాగా మారింది. మొదట ఒకరిద్దర్ని మాత్రమే ఉంచాలనుకున్నా.. ఇప్పుడు అది పది .. పన్నెండుకు చేరింది. మరో రెండు రోజుల సమయం ఉంది. ఈ లోపు ఎంత మంది ఒత్తిడి ప్రయత్నాలు ఫలిస్తాయో చెప్పడం కష్టమంటున్నారు.
ప్రస్తుతం సజ్జలతో కలిసి జగన్ కసరత్తు చేస్తున్నారు. నిజానికి గతంలోనే కసరత్తు పూర్తయింది. ఎవరెవర్ని మంత్రులతో తీసుకోవాలో లిస్ట్ రెడీ చేశారు. కానీ ఇప్పుడది పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అనవసరంగా మంత్రివర్గ విస్తరణను గెలుక్కున్నామనే భావన వైసీపీ హైకమాండ్‌లో వచ్చే పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.