ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన గ్యాస్ కారణంగా అవస్థలు పడుతున్న ఐదు గ్రామాల ప్రజల్లో ధైర్యం నింపడానికి ముగ్గురు మంత్రులతో పాటు… ఎంపీ విజయసాయిరెడ్డి ఆయా గ్రామాల్లో రాత్రి బస చేశారు. గ్రామస్తులు నిరభ్యతరంగా.. ఆయా గ్రామాల్లో ఉండొచ్చని భరోసా ఇచ్చారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ధర్మన కృష్ణదాసు వేర్వేరు గ్రామాల్లో నిద్రించారు. ఉదయం లేచి.. గ్రామస్తులతో ముచ్చటించారు. ఎల్జీ పాలిమర్స్‌లో ఇప్పుడల్లా ఉత్పత్తి ప్రారంభం కాదని.. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని గ్రామస్తులకు మంత్రులు భరోసా ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని…విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
తీవ్ర ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. కంపెనీని అక్కడి నుంచి తరలిస్తామనే భరోసా ప్రభుత్వం నుంచి రాకపోవడంతో.. అక్కడి గ్రామాల ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఎదురు కేసులు పెడుతున్నారన్న అసహనం కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తు బందోబస్తుతో.. మంత్రులు.. ఆయా గ్రామాల్లో బస చేశారు. ఎంపిక చేసిన కొంత మందితోనే మాట్లాడారు. మంత్రులు అక్కడ బస చేసినప్పటికీ.. చాలా మంది ఇంకా శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకోలేదు. వచ్చిన కొంత మంది.. ఇళ్ల తలుపులు తీసేసరికి.. పెద్ద ఎత్తున దుర్వాసన రావడం.. వాంతులు చేసుకోవడంతో వెనక్కి వెళ్లారు.
గ్రామంలో… వేసిన పంటలు… నీటి వనరులు వాడుకోవద్దని.. కేంద్ర నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయినప్పటికీ.. ఆయా గ్రామాల్లో ప్రజలు నివాసం ఉండేలా భరోసా కల్పిస్తామని.. శిబిరాలు ఎత్తేసి.. అందర్నీ.. స్వగ్రామాలకు తరలిస్తోంది ప్రభుత్వం. అక్కడి ఇళ్లలో ఇంకా స్టైరిన్ వాయువు పేరుకుపోయి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు బాధితుల్లో భరోసా కల్పిస్తున్నాయి.. కానీ వాయువు భయం మాత్రం వారిని వెంటాడుతోంది. అన్ని గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ. పదివేలు సాయం అందించి.. వ్యతిరేకతను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.