తెలంగాణలో ప్రజాప్రతినిధుల మధ్య వార్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి జిల్లాలోను మంత్రులు, శాసనసభ్యుల మధ్య రోజురోజుకు యద్ధవాతావరణం పెరిగిపోతోంది. వీరిద్దరి మధ్య ఐఎఎస్, ఐపిఎస్ తో పాటు ఇతర అధికారులు నలిగిపోతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుల పట్ల అధికారుల్లో చులకన భావం పెరిగిపోయిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి విజయం సాధించడం వెనుక పార్టీ అధినేత కే.చంద్రశేఖర రావుపై నమ్మకమే కారణమని, ఈ విజయంలో ఎమ్మెల్యేల పాత్ర లేదనే అభిప్రాయం అధికారుల్లో నెలకొందని అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని మంత్రులు కూడా వ్యక్తం చేయడంతో పాటు స్ధానిక శాసనసభ్యులను కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఇన్నాళ్లూ కోల్డ్ వార్ గా ఉన్నది కాస్తా మెల్లిమెల్లిగా బహిరంగమవుతోంది.
తాజాగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో జరిగిన ఓ అధికారిక సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. తనకు తెలియకుండా… తన నియోజకవర్గంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంత్రిపై విరుచుకుపడ్డారు. వీరి మధ్య కలెక్టర్ నలిగిపోవడం, ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. వరంగల్ జిల్లాలో మంత్రి దయాకర్ కు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రాజయ్యకు మధ్య వార్ నడుస్తోంది. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. తన నియోజకవర్గంలో ఓ పోలీస్ అధికారిని తనకు తెలియకుండా బదిలీ చేశారనేది రాజయ్య ఆరోపణ. ఇక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే చేసిన సిఫార్సును జిల్లా ఉన్నతాధికారి పట్టించుకోలేదని, దీనికి కారణం ఆ జిల్లాకు చెందని మంత్రేనని సదరు ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారని, మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ మంత్రులు, శాసనసభ్యుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అంటున్నారు. దీని ప్రతిఫలమే ఇటీవల స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అనేక స్థానాల్లో ఓటమి పాలయ్యిందంటున్నారు. ఈ వివాదాలన్నీ పార్టీ అధినేతకు తెలిసినా ఆయన మిన్నకుండిపోతున్నారనే అలక ఎమ్మెల్యేల్లో నెలకొందని అంటున్నారు.