తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు! ఆ విషయం శ్రీనివాస్ గౌడ్‌కి ఇప్పుడిప్పుడే అర్థమౌతున్నట్టుగా ఉంది. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయనకి మంచి గుర్తింపే ఉంది. పార్టీ తరఫున కాస్త ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్‌కి ఓ భుజం కాసేస్తుంటారు. సో… సహజంగానే ఆయనకి పార్టీలో కీలకమైన స్థానం ఉంటుందనీ, సమయం వచ్చినప్పుడు సరైన గుర్తింపు ఉంటుందనీ అందరూ అనుకున్నారు. ఎలాగూ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు కదా! ఈ పందేరంలో తనకూ బుగ్గకారు వస్తుందని ఆశించారు. పైగా తన సామాజిక వర్గానికి కేసీఆర్ ఒక పదవి ఇస్తారని ప్రచారం కూడా జరుగుతూ ఉండటంతో… మంత్రి పదవి పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. కానీ, కేసీఆర్ ఆలోచన మరోలా ఉందని స్పష్టం కావడంతో శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం.
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గతంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. కానీ, కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే, మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గౌడ సామాజిక వర్గం కోటాలో బెర్త్ గ్యారంటీ అనుకున్నారు. కానీ, శ్రీనివాస్ గౌడ్ స్థానంలో స్వామి గౌడ్‌కు అవకాశం దక్కబోతున్నట్టు సీఎం కార్యాలయం సంకేతాలిస్తోంది. ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా ఉన్న స్వామి గౌడ్‌కు మంత్రి పదవి దక్కుతుందనీ, కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ తెరాస వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనతో ఉన్న శ్రీనివాస్ గౌడ్, బయటపడిపోతున్నారు.
ఓ ప్రెస్ మీట్లో తన అసంతృప్తిని వెళ్లగక్కేశారు. ఎంపీ జితేందర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. తనకు మంత్రి పదవి ఇప్పించడానికి ఎంపీ జితేందర్ ప్రయత్నించడం లేదంటూ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తనకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ అనేశారు! నిజానికి, ఇలాంటి అసంతృప్తులు ఏవైనా ఉంటే ఆఫ్ ద రికార్డ్ చూసుకోవాలి. ప్రయత్నాలేవైనా చేసుకుంటే అవీ తెర వెనకే ఉండాలి. అంతేగానీ, ఇలా ప్రజల ముందు పదవీ కాంక్షను బయటపెట్టేసుకుంటే ఎలా..? పైగా, కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసినవారు ఎవ్వరూ ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయరు! మంత్రి పదవి దక్కలేదన్న అక్కసు వ్యక్తం చేశాక… తదనంతర పరిణామాలకు కూడా సిద్ధపడాల్సిందే. ఇలాంటి మాటల్ని కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా చెప్పండీ..? ఇంతకీ, స్వామి గౌడ్‌కి కేసీఆర్‌తో ఎక్కడో ఏదో చెడిందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అదేంటో ఇంకా బయటకి రావాల్సి ఉంది. అదేంటో అనేది త్వరలోనే శ్రీనివాస్ గౌడ్ బయటపెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..!