ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి. అయితే ‘మిరల్’ అనే డబ్బింగ్ సినిమా ఈ పరిస్థితిలో కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ఇది. ‘ప్రేమిస్తే’ సినిమా తర్వాత భరత్ కు మరో చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. చాలా ఏళ్ల తర్వాత ‘మిరల్’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భరత్ కు ఈ సినిమా విజయాన్ని అందించిందా? తెలుగు ప్రేక్షకులు అలరించే అంశాలు ఇందులో ఏమున్నాయి?
హరి(భరత్), రమ(వాణి భోజన్) ప్రేమించి పెద్దలని ఎదురించి పెళ్లి చేసుకుంటారు. వీరికి ఓ బాబు. ఉన్నట్టుండి రమకి ఎదో మానసికమైన సమస్య వెంటాడుతుంది. నిద్రపొతే భయానకమైన పీడకలలు వస్తుంటాయి. ఎవరో తనని తరుముతున్నట్లు, వెంటపడినట్లు .. ఇలా ఏవో పిచ్చిపిచ్చి కలలు. రమ మానసిక పరిస్థితి హరికి అంతు చిక్కదు. మరోవైపు హరి పని చేస్తున్న కంస్ట్రక్షన్ సైట్ లో యాక్సిడెంటల్ గా ఓ పెద్ద పిల్లర్ తన కారుపై పడుతుంది. కొద్దిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు హరి. ఇలాంటి అనూహ్యమైన సంఘటనలు ఎదురుకుంటున్న హరికి అత్తగారి నుంచి ఫోన్ వస్తుంది. హరి, రమ జాతకాలు జ్యోతిష్యుడికి చూపించగా ఏదో దోషం ఉందని, ఊర్లో కులదైవాన్ని మొక్కుకుంటే దోషం తీరుతుందని చెబుతుంది. హరి, రమ.. ఊరొచ్చి మొక్కు తీసుకుంటారు. అ రాత్రి తిరుగు ప్రయాణంలో వెళ్తున్న హరి, రమపై ఓ ముసుగు కప్పిన రూపం దాడి చేస్తుంది. ఆ ముసుగులో వున్నది ఎవరు ? రమ మానసిక పరిస్థితి కారణం ఏమిటి ? హరి కారు ప్రమాదానికి, ఈ ముసుగు రూపానికి వున్న లింక్ ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
హారర్ సినిమా అంటే పాడుబడ్డ బంగ్లా, నిర్మానుష్యమైన భవంతి, అక్కడ తిరిగే ప్రేతాత్మలు చుట్టూ భయాన్ని పుట్టిస్తుంటారు, ఈ చిత్ర దర్శకుడు ఎం శక్తివేల్ మాత్రం కొంచెం కొత్తగా అలోచించాడు. అసలు దెయ్యాలు, ఆత్మలు లేకుండా అలాంటి ఫీల్ ఇచ్చే ఓ ట్రీట్మెంట్ తో ఓ సోషల్ కథని చెప్పాలని అనుకున్నాడు. ఆలోచన వరకూ బావుంది కానీ ఆచరణకి వచ్చేసరికే ఇబ్బంది వచ్చింది. రమకి వచ్చే పీడ కలతో కథ మొదలౌతుంది. తర్వాత సమస్య ఏమిటనేది ఎంత వరకూ ఎస్టాబ్లెస్ కాదు. ఇలాంటి కథలు సస్పెన్స్ కొనసాగించడం మంచిదే కానీ ఆ సస్పెన్స్ లో ప్రేక్షకుడి హోల్డ్ అయ్యేలా వుండాలి. మిరల్ లో మాత్రం అది కనిపించదు. ఇంటర్వెల్ వరకూ పెద్దగా ఆసక్తి కలిగించని సన్నివేశాలతోనే కథ ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో హారర్ ఎలిమెంట్ మొదలౌతుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడిలో పాత్రలమీద, కథ మీద పెద్ద ఉత్సాహం వుండదు.
సెకండ్ హాఫ్ చీకటీలో ప్లాన్ చేశారు. ఓ దెయ్యం కథ చుట్టూ అల్లిన కొన్ని సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. ఆ చీకట్లో హరి పడే ఇబ్బందులు, తనకు ఎదురయ్యే సంఘటనలు కాస్త వింతగానే వుంటాయి. అయితే ఇలాంటి కథలు బలమైన ట్విస్ట్ మీద ఆధారపడతాయి. ఇందులో కూడా చివర్లో వరుస పెట్టి ట్విస్ట్ లు వస్తాయి. కానీ అవి అంత బలంగా నిలబడలేదు. పైగా అప్పటివరకూ జరిగిన తంతుని నీరుగార్చేలా వుంటాయి. రివెంజ్ తీర్చుకోవడానికి ఇంలాంటి నాటకం ఆడాలా ? అనే నిట్టూర్పు ప్రేక్షకుడిలో ఆవహిస్తుంది. పైగా చాలా సీన్స్ లో క్లారిటీ లేకుండా వుంటుంది. కొన్ని లాజిక్ కి కూడా అందవు. చివరి పది నిమిషాలు ఏమరపాటుగా చూస్తే మాత్రం అసలు ఏం జరిగిందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంటుంది. నిజానికి అనవసరమైన కన్ఫ్యుజన్ అది.
భరత్ పాత్రకు తగ్గట్టు కనిపించాడు. తన బాడీలాంగ్వేజ్ కి భయం సెట్ అయ్యింది. వాణి భోజన్ పాత్ర చుట్టూ సస్పెన్స్ వుంటుంది. ఆమె నటన కూడా ఓకే. రమ తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన హుందా గా వుంటుంది. సస్పెన్స్ డ్రామాలో ఆ పాత్ర చుట్టూ కూడా అనుమానం వచ్చేలా వుంటుంది. హీరో ఫ్రెండ్ రాజ్ కుమార్, ఆయన భార్యగా కావ్య, రమ తల్లి పాత్రలో మీరా కృష్ణన్ పరిధి మేరకు కనిపించారు.
నేపధ్య సంగీతం హారర్ మూడ్ ని ఎలివేట్ చేసింది. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. నైట్ విజువల్స్ తో బాగానే హారర్ ని క్రియేట్ చేశారు. నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ బాగానే వుంది. దెయ్యం లేకుండా హారర్ సినిమా చేయాలనే దర్శకుడి ఆలోచన బాగానే వుంది కానీ అది తెరపైకి ఓ బలహీనమైన నాటకంలా వచ్చింది.