తూర్పు డిల్లీలో కర్కర్ డూమ జిల్లా కోర్టులో ఈరోజు ఊహించని సంఘటన జరిగింది. డిల్లీలోని మూడవ బెటాలియన్ కి చెందిన ఒక పోలీస్, 73వ నెంబరు కోర్టు హాలులోకి ఒక ముద్దాయిని ప్రవేశపెట్టినప్పుడు, నలుగురు వ్యక్తులు కోర్టు హాలులోకి జొరబడి జడ్జి కళ్ళెదుటే పోలీస్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులలో కోర్టు క్లర్క్, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక పోలీస్ మరణించగా కోర్టు క్లార్క్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులలో గాయపడిన మరొక పోలీస్ ఉద్యోగి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కాల్పులు జరిగిన వెంటనే అక్కడే ఉన్న మిగిలిన పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని ఆ నలుగుడు దుండగులను పట్టుకొన్నారు. కాల్పులు జరిపిన నలుగురిపై ఫర్ష్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. వారిలో ఇద్దరు ముద్దాయికి బంధువులని తెలిసింది. బహుశః సినిమా ఫక్కీలో తమ బంధువుని విడిపించుకుపోదామని ప్రయత్నించారేమో? పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడుతుంది. న్యాయస్థానంలో అనేకమంది లాయర్లు, పోలీసులు, జడ్జి కళ్ళెదుటే కాల్పులు జరిపినందుకు నలుగురు నిందితులకు కటినమయిన శిక్షలు పడవచ్చును.