అమరావతి నిర్మాణం కోసం ఇంకా సుమారు 1400 ఎకరాల భూసేకరణ చేయవలసి ఉంది. ఆ భూములు వైకాపాకు మద్దతు ఇస్తున్న రైతుల అధీనంలో ఉన్నాయి. కనుక వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతోంది. ఈలోగా ఆ ప్రాంతంలో మల్కాపురం అనే గ్రామంలో భూసేకరణను అంగీకరించని ఒక రైతుకి చెందిన నాలుగు ఎకరాలలో చెరుకు తోటకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతులను భయబ్రాంతులను చేసి బలవంతంగా భూసేకరణ చేసేందుకు తెదేపాకు చెందినవారే అటువంటి నీచమయిన పనులు చేస్తున్నారని వైకాపా ఆరోపిస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టి భూసేకరణ ప్రక్రియకు ఆటంకం కలిగించదానికి వైకాపాకు చెందినవారే చెరుకు పంటకు నిప్పు పెట్టారని తెదేపా నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. వాటిపై పోలీసుల చేత దర్యాప్తు జరిపించి దోషులను పట్టుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ సంఘటన జరిగి రెండు మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ వారం రోజుల క్రితం మల్కాపురంలో అటువంటి సంఘటనే జరిగింది. దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి.
ఒకవేళ ఈ పని వైకాపా నేతలే చేయించారని తెదేపా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, వైకాపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు దానికి ఇదొక చక్కటి అవకాశం అవుతుంది. పోలీసులచేత దర్యాప్తు చేయించి దోషులను పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టగలిగితే రైతులు ఇక వైకాపా మాటలని నమ్మబోరు. కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం వలన తెదేపానే అనుమానించవలసి వస్తోంది. వారి వాధోపవాదాలతో ప్రజలను తప్పు ద్రోవ పట్టించవచ్చునేమో కానీ అక్కడి రైతులను ఆ మాటలతో మభ్యపెట్టలేరు.అటువంటి నీచమయిన పనులు ఎవరు చేస్తున్నారో అక్కడి రైతులకు ఖచ్చితంగా తెలుసు. కనుక ఇటువంటి పనులు చేసిన పార్టీలకు రైతులు దూరం అవడం తధ్యం.