జూలై 9న హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి నేటి వరకు అంటే ఏకధాటిగా 42రోజుల పాటు కాశ్మీర్ లో అల్లర్లు, ఆ కారణంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆగస్ట్ 25వరకు కాశ్మీర్ లో బంద్ పాటించాలని వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. దానిని ఇంకా మరికొన్ని రోజులు పొడిగించినా ఆశ్చర్యం లేదు.
ఈ అల్లర్లు, బందులు, కర్ఫ్యూ కారణంగా సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కాశ్మీర్ ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంటుంది. దానికి మార్చి-ఏప్రిల్ నెలలలో వేసవి మొదలైనప్పటి నుంచి అక్టోబర్- నవంబర్ వరకు పీక్ సీజన్. కానీ గత 42 రోజుల నుంచి ఈ అల్లర్లు, కర్ఫ్యూ కారణంగా కాశ్మీర్ కి పర్యాటకులు రావడం మానేశారు. ఒకవేళ ఎవరైనా సాహసించి వద్దామనుకొన్నా బంద్, కర్ఫ్యూ కారణంగా కాశ్మీర్ లో ఉన్న వందలాది హోటల్స్ అన్నీ మూతపడి ఉన్నాయి.
పర్యాటక రంగంపైనే ఆధారపడిన వందలాది హోటల్స్, వాటి యజమానులు, వాటిలో పనిచేసేవారు, హౌస్ బోట్స్, టాక్సీలు, ఆటోలు నడుపుకొని జీవనం సాగించేవారి పరిస్థితి చాలా దయనీయంగా మారిందిపుడు. వారే కాకుండా పర్యాటకులకి సేవలు అందించే గైడ్స్, నిరుపేద షికారాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. గత 42 రోజులు ఆదాయం నిలిచిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో మౌనంగా విలపిస్తున్నారు. వేర్పాటువాదులకి, భద్రతాదళాలకి మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు.
ఈ బందులు, కర్ఫ్యూ ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో కూడా తెలియదు. ముఖ్యంగా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలో మహిళలు, పసిపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఫోన్లు, ఇంటర్ నెట్, న్యూస్ పేపర్లు సమాచార వ్యవస్థ కూడా నిలిచిపోవడంతో కాశ్మీర్ కి బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.
పాక్ ప్రేరణతో వేర్పాటువాదులు ఈ పరిస్థితిని ఇంకా ఇలాగే కొనసాగించాలని ప్రయత్నిస్తునందున శాంతిభద్రతలని కాపాడేందుకు కాశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగించక తప్పడంలేదు. కాశ్మీర్ లో ఇంత సుదీర్గకాలంపాటు ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండేలా చేయడాన్ని పాక్ విజయంగా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ వైఫల్యంగానే భావించవలసి ఉంటుంది.
కాశ్మీర్ లో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. యుద్దప్రాతిపదికన కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలని అందులో నిర్ణయించారు. ఇప్పటికే వారం రోజులు అయ్యింది. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంకా ఎప్పటికి వస్తుందో తెలియదు. కనుక బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజల సమస్యల కంటే ముందు కాశ్మీర్ లో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కష్టాల గురించి ఆలోచించి, తక్షణమే వారికి అవసరమైన సహాయసహకారాలు అందించడం చాలా అవసరం. ముందుగా వారి జీవనానికి అవసరమైన సహాయం అందిస్తూ ప్రభుత్వం చర్చల ప్రక్రియ కొనసాగించడం మంచిది. కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీకి బాగా అవగాహన ఉంటుంది కనుక ఆమె కేంద్రప్రభుత్వం సహాయం తీసుకొని వారి అవసరాలని తీర్చగలిగితే ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. క్రమంగా పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటాయి.