Miss Shetty Mr Polishetty Movie Telugu Review
రేటింగ్: 2.75/5
అనుష్క- నవీన్ పొలిశెట్టి..
నిజానికి ఈ కాంబోనే క్రేజీగా ఉంది. అనుష్క హీరోయిన్లలో స్టార్ డమ్ సంపాదించుకొంది. నవీన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వీళ్లపై మామూలు లవ్ స్టోరీ వర్కవుట్ కాదన్నది అందరికీ తెలుసు. ఏదో ఓ క్రేజీ పాయింట్ పట్టుకొంటే తప్ప – థియేటర్లో ఆడియన్స్ ని కన్వెన్స్ చేయలేరు. దర్శకుడు మహేష్… కూడా రెగ్యులర్ పాయింట్‌తో రాలేదు. పెళ్లి, సెక్స్, రిలేషన్ లేకుండా తల్లి కావాలని ఆరాట పడే హీరోయిన్.. ఆమెకు డోనర్‌గా సహకరించే హీరో.. ఇదే స్థూలంగా కథ. పేపర్ పై క్రేజీగా కనిపించే పాయింట్, పోస్టర్‌పై వెరైటీగా కనిపించిన కాంబో.. థియేటర్లో వర్కవుట్ అయ్యాయా, లేదా?
అన్విత (అనుష్క) యూకేలో చెఫ్. అమ్మ (జయసుధ) అనారోగ్యంతో బాధ పడుతుంటుంది. చివరి రోజుల్లో ఆమెను సంతోషంగా ఉంచాలన్న తాపత్రయంతో ఇండియా తీసుకొస్తుంది. పెళ్లిపై అన్వితకు సదాభిప్రాయం ఉండదు. కానీ.. చనిపోతూ చనిపోతూ అమ్మ చెప్పిన మాటలకు ప్రభావితం అవుతుంది. తనకంటూ ఓ తోడు ఉండాలనుకొంటుంది. ఓ బిడ్డకు జన్మ ఇవ్వాలనుకొంటుంది. అది కూడా సెక్స్ అవసరం లేకుండా. కృత్రిమ గర్భం ద్వారా తల్లిగా మారి, ఒంటరితనం పోగొట్టుకోవాలనుకొంటుంది. అయితే… వీర్యదానం ఎవరితో చేయించాలన్నదే ప్రశ్న. తనకు నచ్చిన, తాను మెచ్చిన వ్యక్తి వీర్యంతోనే తల్లికావాలనుకొంటుంది. ఆ ప్రయాణంలో… సిద్దు (నవీన్ పొలిశెట్టి) పరిచయం అవుతాడు. తనో స్టాండప్ కమెడియన్. అన్వితని ప్రేమిస్తాడు. కానీ అన్విత మాత్రం తాను తల్లి కావడానికి సహకరిస్తే చాలంటుంది. మరి.. సిద్దు ఏమన్నాడు? తాను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఇదంతా మిగిలిన కథ.
దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ మోడ్రన్‌గా ఉంది. నిజానికి విక్కీ డోనర్, మొన్నొచ్చిన స్వాతిముత్యం లాంటి సినిమాలు చూసిన వాళ్లకు `వీర్యదానం` గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే… అలాంటి కథలో మోడ్రన్ థాట్స్ ఉన్న అమ్మాయి, అమ్మాయి హలో చెబితే చాలు.. ఐ లవ్ యూ అనుకొనే అబ్బాయి క్యారెక్టర్లని తీసుకొచ్చి నిలబెట్టాడు. అందుకే ఈ కాంబో మరింత క్రేజీగా అనిపిస్తుంది. యూకేలో అన్వితని పరిచయం చేస్తూ ఈ కథని మొదలెట్టాడు దర్శకుడు. అన్విత చెఫ్‌గా చేసే మాయాజాలం, ఇంట్లో తల్లితో ఉండే అనుబంధం.. ఇవన్నీ చూపిస్తూ కథలోకి తీసుకెళ్లాడు. అయితే ఆ సన్నివేశాలు చాలా నిదానంగా సాగుతాయి. ఎప్పుడైతే.. సిద్దూగా నవీన్ పాత్ర పరిచయం అవుతుందో, అక్కడి నుంచి కొన్ని నవ్వులు మొదలవుతాయి. నవీన్ కామెడీ, తన టైమింగ్ సూపర్బ్ గా ఉంటుంది. దానికి తోడు.. ఇందులో స్టాండప్ కమెడియన్. దాంతో.. ఫన్ రైడ్ స్టార్టవుతుంది. స్టాండప్ కామెడీ ఎప్పుడూ క్లాస్ టచ్‌తోనే సాగుతుంది. పగలబడి నవ్వడం ఏమీ ఉండదు కానీ.. పెదాల పై చిరునవ్వు కనిపిస్తుంది. అందుకే మరీ హిలేరియస్ సీన్లు ఏం రావు కానీ… టైమ్ పాస్ కి ఢోకా ఉండదు.
అన్విత కేరింగ్ ని సిద్దు ప్రేమ అనుకోవడం, తను ప్రపోజ్ చేయడం.. అన్విత రిజెక్ట్ చేయడం… దాంతో ఇంట్రవెల్ పడిపోతుంది. ఫస్టాఫ్‌లో పెద్దగా చెప్పుకోవడానికి మైనస్‌లు కనిపించవు. యూకే ఎపిసోడ్ తప్ప. ద్వితీయార్థంలో అసలు డ్రామా మొదలవ్వాలి. అయితే.. ఇక్కడ కన్ఫ్యూజ్ డ్రామాపై ఆధారపడ్డాడు దర్శకుడు. అన్విత ప్రపోజల్‌ని సిద్దూ తప్పుగా అర్థం చేసుకొంటాడు. దాంతో కొంత కామెడీ పండినా, కథ పరంగా ఎలాంటి డవలెప్మెంట్ జరగలేదు. అసలు పనికి… సిద్దూ రెడీ అయివెళ్లడం, అన్విత ఆఫీసులో.. `కార్యం` కోసం సన్నద్దం అవ్వడం ఇవన్నీ ఫన్ని క్రియేట్ చేయగలిగాయి. ఇక్కడే దర్శకుడు కాస్త తెలివితేటలు వాడాడు. ఈ సీన్లు అటూ ఇటూగా రాసుకొంటే.. కథ, అందులోని ఎమోషన్ ప్రేక్షకులకు తప్పుగా కన్వే అయ్యేప్రమాదం ఉండేది. అనుష్క, నవీన్ ఇద్దరూ ఈ సీన్స్ ని సమన్వయంతో హ్యాండిల్ చేశారు. కాబట్టి ఆ సీన్లు ఎబ్బేట్టుగా అనిపించవు. ఓరకంగా.. క్లాస్ అడల్ట్ సీన్లన్నమాట. దర్శకుడు ఎంచుకొన్న పాయింటే వీర్యదానం గురించి కాబట్టి.. ఆమాత్రం టచ్ ఇవ్వక తప్పలేదనిపిస్తుంది.
కథ చాలా ఫ్లాట్ గా ఉంది. తరవాత ఏం జరగబోతోంది? అనేది ఊహించడం కష్టమేం కాదు. అయితే అలాంటి సన్నివేశాల్ని సైతం ఎంటర్టైన్మెంట్ జోడించి చెప్పొచ్చు. అన్విత లండన్ వెళ్లిపోయాక కథ మొత్తం డ్రాప్ అయిపోతుంది. ఫన్ కూడా పండదు. సిద్దూ, అన్వితల ఎమోషనల్ బాండింగ్ కూడా చూపించడానికి ఏం లేకుండా పోయింది. దాంతో క్లైమాక్స్ ఎప్పుడవుతుందా అని చూడడం ప్రేక్షకుల వంతు అవుతుంది. ప్రీ క్లైమాక్స్ లో నడిపిన దాగుడు మూతల డ్రామా కూడా అవసరం లేదు. వంకాయ బజ్జీ తిని.. అన్విత ఆ చుట్టు పక్కల ఎక్కడో ఉందని సిద్దు కనుక్కోవడం పరమ రొటీన్‌గా అనిపించే వ్యవహారం.
అనుష్క, సిద్దు.. వీరిద్దరిలో ఎవరు లేకపోయినా ఈ కథ లేదు. ఈ కథ ఇంతైనా నిలబడిందంటే దానికి కారణం వీళ్లే. అనుష్క చాలా హుందాగా ఉంది. ఆమె స్టార్డమ్, క్రేజ్ ఈ పాత్రని మరింత నిలబెట్టాయి. అయితే.. ఆమె చాలా బొద్దుగా మారడం ఇబ్బంది పెట్టే విషయం. అనుష్కలోని నటిని ఛాలెంజ్ చేసే సీన్లు కూడా ఇందులో లేవు. చాలా క్యాజువల్ గా చేసింది. పొలిశెట్టిది మాత్రం వన్ మాన్ షో. స్టాండప్ కమెడియన్‌గా తనకు ఇది టేలర్ మేడ్ పాత్ర అని చెప్పాలి. ఏమాత్రం బలం లేని సన్నివేశాన్ని కూడా తను నిలబెట్టగలిగాడు. అనుష్క స్థానంలో మరొకర్ని ఊహించుకోగలం కానీ, నవీన్ పాత్రకి మాత్రం రిప్లేస్మెంట్ లేదనిపిస్తుంది. నాజర్, జయసుధ.. పాత్ర పరిధిమేర నటించారు. అభినవ్ గోమటం ఎప్పటిలా రొటీన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు.
రధన్ పాటల్లో గుర్తుంచుకొనే ట్యూన్ ఒక్కటీ లేదు. ఒక్క పాట హిట్టయినా….థియేటర్లో ఆ మూడ్ వేరేలా ఉండేది. కథే.. క్లాస్, మెడ్రన్ టచ్‌తో సాగేది. దానికి తోడు పాటలూ అదే మూడ్ లో ఉంటాయి. దాంతో.. సినిమా మరింత ఫ్లాట్ గా మారిపోయింది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ మీద ఆధారపడిపోవడం మరో ప్రధానమైన లోపం. నవీన్ ఉన్నాడు కదా.. సింపుల్ గా రాసినా డైలాగ్ పేలుతుంది అని దర్శకుడు అనుకొన్నాడేమో. సీన్లు రాసేటప్పుడు మరింత దృష్టి పెడితే.. ఇది మరో జాతి రత్నాలు అయ్యేది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్.. వీటికి వంక పెట్టలేం.
గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనెప్… అనే కొటేషన్ ఓ సీన్లో తెరపై కనిపిస్తుంది. సినిమా కూడా అంతే. ఈరోజుల్లో `ఓకే. ఓకే` కథలూ, కాన్సెప్టులూ పని చేయవు. ఏదైనా సరే.. సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాల్సిందే. దర్శకుడు అలాంటి కాన్సెప్టునే తీసుకొన్నా.. రాతలో, తీతలో యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయాడు.
రేటింగ్: 2.75/5