నాలుగు రోజుల క్రితం తమిళనాడులోని తాంబరం విమానాశ్రయం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన భారత వాయుసేనకి చెందిన విమానం ఎ.ఎన్.32 కోసం, 18నౌకలు, 13విమానాలు, 4హెలికాఫ్టర్లు, ఒక సబ్ మెరైన్ తో అది కూలిపోయినట్లు అనుమానిస్తున్న బంగాళాఖాతంలో వెతుకుతూనే ఉన్నారు. మొదట 5,000 చదరపు కిమీ పరిధిలో వెతికినప్పటికీ విమానం ఆచూకి కనబడకపోవడంతో, గాలింపు చర్యలని 15,000 చదరపు కిమీ విస్తరించారు.
ఇంతవరకు విమానం ఆచూకీ కనిపెట్టలేకపోయారు కానీ తాంబరం ఆర్మీ ఆసుపత్రి నుంచి ఈరోజు ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఒక ఫోన్ కాల్ విమానం దొరికి ఉండవచ్చనే అనుమానం కలిగిస్తోంది. శవాలను భద్రపరచడానికి, తదుపరి కార్యక్రమాలకోసం ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్మీ ఆసుపత్రి అధికారులు కోరారు. తాంబరం ఆర్మీ ఆసుపత్రిలో కేవలం 4 శవాలని మాత్రమే భద్రపరిచేందుకు వీలవుతుంది. విమానం కనబడకుండా పోయినప్పుడు దానిలో మొత్తం 29 మంది ప్రయాణిస్తున్నారు. కనుక గాలింపు చర్యలు చేపడుతున్న బృందాలు విమానం ఆచూకి కనుగొని ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ విమానంలో విశాఖనగరానికి చెందినవారు ఏడుగురు వ్యక్తులున్నారు. వారి కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే పరామర్శించి వెళ్ళారు. ఇవ్వాళ జగన్మోహన్ రెడ్డి వారిని కలిసి ఓదార్చారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి తాంబరంలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఫోన్ కాల్ ని బట్టి విమానం ఆచూకి కనుగొన్నట్లే ఉంది కనుక త్వరలో ఏదో ఒక సమాచారం ఖచ్చితంగా తెలియవచ్చునని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.