మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.. ఆ పిటిషన్ వెనక్కి వచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ధర్మాసనం పేర్లు తప్పుగా రాశారు. అలాగే..ఇచ్చిన ఉత్తర్వులేమిటో.. పిటిషన్‌కు జత చేయలేదు. దీంతో తప్పులు సరిదిద్దుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సోమవారమే విచారణకు వస్తుందని ఆశపడిన ఏపీ సర్కార్‌కు సోమవారం విచారణకు రాలేదు. దాంతో అర్జంట్‌గా విచారించాలంటూ.. మరో అప్లికేషన్ పెట్టారు. ఈ తరుణంలో పిటిషన్లో తప్పులు బయటపడ్డాయి.
ఇప్పుడు ఏపీ సర్కార్ పని రెంటికి చెడ్డ రేవడి అయినట్లయింది. ఓ వైపు హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ తేలిన తరవాత హైకోర్టులో విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తప్పుల వల్ల.. పదహారో తేదీకి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. దీంతో… శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి అడ్డంకులను పట్టించుకునేవారు కాదని.. ఆయన అనుకుంటే శంకుస్థాపన చేసేస్తారని అంటున్నారు. ప్రభుత్వ ఆలోచన ఏమిటో.. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించిన న్యాయనిపుణులకు పిటిషన్లు వేయడం కూడా రావడంలేదు. గతంలో నిమ్మగడ్డ విషయంలో తప్పుల తడకలతో పిటిషన్లు వేయడంతో ఓ సారి వెనక్కి వచ్చాయి.