ప్రేక్షకులు ‘మహానటి’కి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎట్ ద సేమ్ టైమ్… సినిమాపై కొన్ని విమర్శలూ వచ్చాయి. సినిమా చరిత్రను వక్రీకరించారని కొందరు ఘాటుగా దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలపై విమర్శించారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ‘ఏది సత్యం? ఏది అసత్యం? ఓ మహానటీ’ అంటూ ఫుల్ పేజీ ఆర్టికల్ రాశారు. సినిమాలోని తప్పుల గురించి సమగ్ర విశ్లేషణ అందించారు. దర్శకుడు నాగ అశ్విన్ తెలిసే ఆ తప్పులను చేశార్ట. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, నాగ అశ్విన్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన సండే స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ తప్పుల గురించి ప్రస్తావన వచ్చింది.
‘సినిమాలో నేను చేసిన చిన్న చిన్న తప్పుల గురించి బయట వాళ్లు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి?’ అని దర్శకుడు నాగఅశ్విన్ నిర్మాతలు ఇద్దర్నీ ప్రశ్నిస్తాడు. “ఇది (అంటే… తప్పుల గురించి) నువ్వు మాకు ముందే చెప్పావు కదా! ఎస్వీ రంగారావుగారి గురించే కదా నువ్వు అనేది. మళ్లీ ప్రశ్న అడుగుతావేంటీ?” అని స్వప్న దత్ స్పందిస్తే… “నీకంటూ (దర్శకుడికి) కొన్ని పరిధులు ఉన్నాయి. ప్రేక్షకులు సినిమాని ఆద్యంతం చూసేలా వుండాలని కోరుకున్నావు. అందుకోసం నువ్వు (దర్శకుడు) చేసింది తప్పు కాదని నా ఉద్దేశం. సినిమా అన్నాక కొన్ని లిబర్టీస్ వుంటాయి” అని ప్రియాంక దత్ సమాధానం ఇచ్చారు.
దర్శకుడు నాగఅశ్విన్ చేసినవి తప్పే కాదని ఆయన భార్య, నిర్మాత ప్రియాంక దత్ స్పష్టం చేస్తే.. మరో నిర్మాత స్వప్న దత్ తనకు తప్పుల గురించి ముందే తెలుసునని తెలిపారు. ప్రతి సినిమాలోనూ చిన్న చిన్న లోపాలు వుండటం సహజమే. మంచి సినిమాలో వాటిని ప్రేక్షకులు కూడా క్షమించేస్తారు. ‘మహానటి’ విషయంలో జరిగినది అదే. సినిమాలోని చిన్న చిన్న తప్పులను క్షమించి పెద్ద విజయం కట్టబెట్టారు.