కరోనా టెస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారదర్శకత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ 20235 కరోనా శాంపిళ్లను టెస్ట్ చేశామని… శుక్రవారం మధ్యాహ్నం డాష్‌బోర్డులో అప్ డేట్ చేసింది. మొత్తంగా 572కేసులు ఉన్నాయని 35 మంది డిశ్చార్జ్ అయ్యారని 523 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. మిగతా వివరాల సంగతేమో కానీ.. ఒక్క సారిగా 20235 టెస్టులు చేశామని ప్రకటించడంతోనే… చాలా మందికి ఇదేదో తేడా వ్యవహరంలా అనిపించింది. ఎందుకంటే..14వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు డాష్ బోర్డులో చేసిన అప్ డేట్ మేరకు.. చేసిన టెస్టులు 10505 మాత్రమే. ఏప్రిల్ 15 వ తేదీన ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 11 వేల 613 శాంపిళ్లను టెస్ట్ చేశారు. అంటే ఒక్క రోజులో 9 వేలకుపైగా టెస్టులు చేసినట్లుగా ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంది.
కానీ.. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఏడు కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఎవరు పడితే వారు టెస్టులు చేయడానికి లేదు. కేంద్రం గుర్తింపు ఇచ్చిన ల్యాబ్స్‌లోనే టెస్ట్ చేయాలి. ఇలా మొత్తం ఏడు టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఏపీలో ఉన్న ఏడు ల్యాబ్ లు ఇరవై నాలుగు గంటలు పని చేస్తే.. 990 టెస్టుల్ని మాత్రమే చేయగలరు. ఈ వివరాలను ప్రభుత్వమే ప్రకటించింది. అయితే.. ట్రూనాట్ మిషన్లు అని..మరొకటని చెప్పి.. శుక్రవారం మూడు వేల టెస్టులు చేశామని.. ఏపీ ప్రభుత్వం కరోనా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న జవహర్ రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటించిన టెస్టులు 16555 మాత్రమే. ఇలా ఒక్కోరు ఒక్కో లెక్క చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో సీఎంవో కీలక అధికారి పీవీ రమేష్ స్పందించారు.
లెక్కల ఎంట్రీలో పొరబాటు జరిగిందని చెప్తూ… సేకరించిన శాంపిళ్లకు బదులుగా… టెస్ట్ చేసిన శాంపిళ్ల లెక్క చూపెట్టామంటూ చెప్పుకొచ్చారు. కానీ డాష్ బోర్డులో మాత్రం.. అధికారులు మార్పులు చేయలేదు. పది లక్షల మందికి 331 మందికి టెస్టులు చేస్తున్నామంటూ మరో లెక్క ప్రకటించిన ఏపీ సర్కార్..అందులో 16555 టెస్టులు జరిగినట్లుగా చూపించారు. దీంతో అసలు నిజమేతో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక వివరణాత్మక శ్వేతపత్రం ఇవ్వాలని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు.