ప్రశ్నించడం పార్ట్ టైమ్ జాబ్ కాదు. అది శ్వాస తీసుకున్నంత సహజమైంది అయితేనే విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు సమస్య వస్తే, షూటింగ్ పూర్తయి, ఆడియో ఫంక్షన్ అయిపోయాక తాపీగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం వల్ల ఫలితం ఉండదు. పవన్ కల్యాణ్ ప్రశ్నించే పార్టీ జనసేన ఎప్పుడో ఓసారి తళుక్కున మెరుస్తుంది. షూటింగ్ లో బిజీగా ఉంటూ ప్రశ్నించడం గురించి చాలా కాలం పాటు ఆయన మర్చిపోతారు. ఎప్పుడో ఓసారి గుర్తుకు వచ్చినప్పుడు ప్రశ్నించే ప్రోగ్రాం పెట్టుకుంటారు. 2019 ఎన్నికల్లో ఆయన అద్భుతాలు చేస్తారని అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆయన వ్యవహార శైలి మాత్రం నిరాశాజనకంగానే కనిపిస్తోంది.
నాదగ్గర డబ్బుల్లేవు, నెల గడవడానికే కష్టంగా ఉందని పవన్ కల్యాణ్ వంటి బడా యాక్టర్ చెప్పడం విని అంతా నివ్వెరపోయారు. ఒక సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తికి నెల గడవడం కష్టంగా ఉంటే, ఈ దేశంలో నెలకు పది వేలు కూడా సంపాదన లేనివాళ్లు ఏమనాలి? ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని బక్క రైతులు ఏమనాలి? అయినా వాళ్లంతా ఆత్మవిశ్వాసంతో తమ పని తామ చేసుకుంటారు. కష్టపడి పనిచేసి కుటుంబాలను పోషించుకుంటారు. అంతేగానీ ఇలా బీదరుపులు అరవరు.
అభిమానులు పెరిగేకొద్దీ, నటుడు స్టార్ గా మారేకొద్దీ ఏం చేసినా ఏం చెప్పినా చెల్లుతుందనే భావం ప్రబలుతుంది. అదే ఎంతటి వారిచేతైనా తప్పటడుగులు వేయిస్తుంది. పవన్ కల్యాణ్ అదే చేస్తున్నట్టున్నారు. ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్లు తీసుకుంటారని టాక్. అదినిజమో కాదో ఆయనే చెప్పాలి. అయితే అంతటి పెద్ద స్థాయి సినిమా నటుడు బీదవాడు కాదని అందరికీ తెలుసు. నెల గడవడం కష్టంగా ఉందనే మాట, ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అభిమానులు సరే. నేలను చూపించి ఆకాశం అన్నా గుడ్డిగా నమ్మేస్తారు. సామాన్య ప్రజలు అలాకాదు. వచ్చేఎన్నికల్లో పవన్ పార్టీ అద్భుతాలు చేయాలంటే కేవలం ఫ్యాన్స్ ఓటేస్తే సరిపోదు. కోట్ల మంది ప్రజలు ఓటు వెయ్యాలి. అలా వెయ్యాలంటే విశ్వసనీయత ఉండాలి.
ఏపీ రాజధాని, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం విషయంలో పదే పదే ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పవన్ మాత్రం మొన్నటి వరకూ షూటింగులో బిజీగా ఉన్నారు. రేపో మాపో మరో సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇలాంటి వ్యక్తి ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని చెప్పకూడదు. ప్రశ్నిస్తూ ఉండాలి. మాటమీద నిలవడతాడనే నమ్మకం కలిగించాలి. ఏపీకి కేంద్రం నుంచి సహాయం సరిగా అందటం లేదని చంద్రబాబు సహా చాలా మంది ఫీలవుతున్నారు. ఈ విషయంలో ప్రశ్నించాల్సిన బాధ్యతను పవన్ విస్మరిస్తున్నారనే అభిప్రాయానికి ఆయనే కారణం అవుతున్నారు. కేంద్రాన్ని నిలదీయడం ద్వారా ఏపీకి సహాయం త్వరగా అందేలా చూడటానికి గట్టి ప్రయత్నం ఇంత వరకూ పవన్ చేయక పోవడం గమనార్హం.
సర్దార్ గబ్బర్ సింగ్ హిట్టా ఫ్లాపా అనేది వేరే సంగతి. నిర్మాత భారీగా నష్టపోయారని పవన్ స్వయంగా చెప్పారు. నష్టాన్ని భర్తీ చేయడానికి మరో సినిమా చేస్తానన్నారు. నటుడిగా అది ఆయన వృత్తి. అయితే పవన్ రేంజి పెరిగేకొద్దీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. రాష్ట్రానికి రాబోయే బడా నేతగా ఆయన్ని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అద్భుతాలు సాధిస్తారని ఆశిస్తున్నారు. దానికి ఇప్పటినుంచే బాటలు వేసుకోవాల్సి ఉంటుంది. మాస్ సినిమాల పేరుతో కొద్ది మందిని మాత్రం టార్గెట్ చేసి సినిమాలు తీయడం మైనస్ కావచ్చు. సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్, లుంగీమీద ఖాకీ చొక్కా ఫొటోలు చూసి పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఆ సినిమా చూడటానికి వెనుకాడటం కనిపిస్తోంది. క్లాసా మాసా అనేది కాదు, జనానికి దగ్గరయ్యే సినిమాలు ఆయనకూ, అభిమానులకూ మేలు చేస్తాయి.
రాజకీయంగా రాష్ట్రానికి ఏదో చేయాలనుకునే వ్యక్తి జనంలో ఉండాలి. సందర్భానుసారం జనంలోకి, మీడియాలోకి రావాలి. నేను ప్రశ్నిస్తాను అనడం సరే. ప్రజల ప్రశ్నలకు కూడా జవాబివ్వాలి. నెలగడవడం కష్టంగా ఎందుకుందనే ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాలి. ఆస్తిమొత్తం సామాజిక సేవకోసం వెచ్చిస్తే నెల గడవడం కష్టమవుతుంది. అనవసరంగా, చేయకూడని పనులకోసం దుబారా చేస్తే సొమ్మంతా ఖర్చయిపోతుంది. ఇంతకీ ఇందులో ఏ కారణం కరెక్టనుకోవాలి? తాను ఎదటివాళ్లను ప్రశ్నించి, తనను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తప్పించుకోవడం నాయకుడి లక్షణం కాదు. ఇలాంటి అతిశయోక్తి బీద అరుపులు ఆయన విశ్వసనీయతకు విఘాతం కలిగిస్తాయి. ఆయన్ని నమ్మడానికి జనం వెనుకాడేలా చేస్తాయి. సామాజిక స్పృహ ఉన్న అత్యంత ప్రముఖ నటుడు ఈ విషయంలో ఇప్పటి నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుంటారేమో చూద్దాం.