బళ్లు ఓడలవ్వడానికీ, ఓడలు బళ్లు అవ్వడానికీ చిత్రసీమలో ఎంతో టైమ్ పట్టదు. ఇప్పుడు శ్రీనువైట్లని చూసినా అదే అనిపిస్తోంది. దూకుడు సమయంలో శ్రీనువైట్ల ‘దూకుడు’ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్కి కేరాఫ్ గా నిలిచాడు శ్రీను. ఆగడు నుంచి పరాజయాల ఎపిసోడ్ మొదలైంది. బ్రూస్లీతో పెద్ద దెబ్బ తగిలింది. రెండు ఫ్లాపులకే.. శ్రీను వైట్ల నీరు గారి పోయాడు. మహేష్ రేంజున్న దర్శకుడు వరుణ్ తేజ్‌తో ఫిక్స్ అవ్వాల్సివచ్చింది. అయితే ఆ ఆఫర్ కూడా అంత ఈజీగా రాలేదు. ”నాకు పారితోషికం వద్దు.. నేనే డబ్బులు పెడతా” అంటూ.. ఇచ్చిన బంపర్ ఆఫర్ తో మిస్టర్ సినిమా మొదలైంది. ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్‌గా మారడం శ్రీనువైట్ల ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి ఈ సినిమాకి అసలు సిసలైని నిర్మాతలు. శ్రీనువైట్ల తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టాడు. దానికి ప్రతిఫలంగా ఈస్ట్, కృష్ణ. వైజాగ్ జిల్లా హక్కుల్ని తన దగ్గరే ఉంచుకొన్నాడు. అయితే… మిస్టర్ సినిమాపై ముందుగానే అనుమానం రావడంతో… ఠాగూర్ మధు, బుజ్జిల నుంచి శ్రీనువైట్లపై ఒత్తిడి పెరిగినట్టు, దాంతో శ్రీనువైట్ల కొంత మొత్తాన్ని నిర్మాతలకు అందచేసినట్టు, ఆ డబ్బుల్ని సర్దుబాటు చేయడానికి తన ఫ్లాట్‌ని అమ్ముకొన్నట్టు తెలుస్తోంది. ఆగడు సమయానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్న దర్శకుడు.. రెండు సినిమాల తేడాతో ఎదురు డబ్బులివ్వడం, అందుకోసం ఫ్లాట్‌ని సైతం అమ్ముకోవడం విధి వైపరిత్యం కాకపోతే మరేంటి?? తన దగ్గరున్న మూడు ఏరియాలకూ కొంత మేర అడ్వాన్సులైతే శ్రీనువైట్లకు అందాయి. అయితే అది కేవలం కంటి తుడుపు మాత్రమే. ఈ ఫ్లాప్ నుంచి బయటపడడానికి శ్రీనువైట్లకు ఎంత టైమ్ పడుతుందో ఏంటో…..