హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. నిన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వోద్యోగిని చితకబాదిన కేసులో అరెస్ట్ చేయగా, ఇవాళ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. రొంపిచర్ల మండల పరిధిలోని అసైన్డ్ భూముల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డు పనులకు అడ్డు తగలటమేకాక ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఎమ్ఆర్ఓ ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీనితో పోలీసుల తీరుకు నిరసనగా ఇవాళ ఉదయం శ్రీనివాసరెడ్డి ధర్నా చేయటానికి ప్రయత్నించారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఎమ్మెల్యే ఇవాళ ఉదయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోపిరెడ్డి ర్యాలీ నిర్వహించటం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేకు మద్దతుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఈ తెల్లవారుఝామున 4 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో నెల్లూరులో రైలుకు నిప్పంటించిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ఇవాళ పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు కోర్టులో హాజరు పరచగా, ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు.