పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని పాపాలు వెంటాడుతున్నాయి. తండ్రి, కొడుకులు పుంగనూరులో అడుగు పెట్టేందుకు కూడా అక్కడి ప్రజలు ఇష్టపడటం లేదు. వైసీపీ హయాంలో రాజుల కాలం నాటి వ్యవహారశైలితో ప్రత్యర్ధులపై దాడులు, ప్రశ్నించిన వారిపై కేసులు మోపి..భయానక వాతావరణం సృష్టించారు. ఇప్పుడు కాలం తిరగబడినట్లే ప్రజలూ తండ్రి, కొడుకులపై తిరగబడుతున్నారు.
ఆ మధ్య పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటనను వ్యతిరేకించిన పుంగనూరు పబ్లిక్.. ఇప్పుడు అయన కొడుకు మిథున్ రెడ్డి పుంగనూరులో పాదం మోపడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వెంటనే మిథున్ రెడ్డి పుంగనూరు నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. కూటమి కార్యకర్తలు కూడా వారికి తోడవ్వడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పెద్దిరెడ్డి పుంగనూరు వేదికగా రాజకీయం కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది. తండ్రి, కొడుకుల రాకను పబ్లిక్ సైతం వ్యతిరేకిస్తుండటంతో అక్కడ ఉండటం వారిని సైతం ఆలోచనలో పడేస్తూ ఉండొచ్చు. ధైర్యం చేసి పుంగనూరులో అడుగుపెట్టినా వారిని ఎక్కడిక్కడ అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిసారి వారిని పోలీసులు నిలువరించడం పెద్దిరెడ్డికి కూడా తలవంపులు తెచ్చిపెట్టేదే. ప్రతీ పర్యటనలోనూ నిరసనలు స్వాగతం పలికితే రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.
కూటమి కార్యకర్తలను అయితే ఆయా పార్టీలు ఓ పిలుపుతో కట్టడి చేయగలవు. కానీ, ప్రజలపై పెద్దిరెడ్డి ఆగ్రహాన్ని ఏ పార్టీలు చల్లార్చగలవు..? అందుకే తండ్రి, కొడుకులు పుంగనూరుకు గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ నడుస్తోంది.