తాను ఎంపీనని .. రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ పాలసీతో తనకేం సంబంధం అని వాదించిన మిథున్ రెడ్డికి ఇప్పుడు అసలు లిక్కర్ స్కాంలో తన పాత్రేమిటో సీఐడీ అధికారులు గుర్తుకు తెచ్చేలా చేయడానికి ప్రయత్నించారు. ఎనిమిది గంటల పాటు ఆయనను లిక్కర్ స్కాంపై ఏర్పాటైన సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం పాలసీలో జోక్యం దగ్గర నుంచి డిస్టిలరీలు లాక్కుని వాటి ద్వారా ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయడం వరకూ చాలా ప్రశ్నలకు డాక్యుమెంట్ల సహితంగా ఆయనకు ముందు ఉంచారు. అలాగే.. నగదు రూపంలో సేకరించిన డబ్బుల్ని ఏ రూపంలో తరలించారు.. ఎలా వైట్ గా మార్చే ప్రయత్నం చేశారన్న లెక్కలు కూడా ఆయన ముందు పెట్టి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
లాయర్ దూరంగా కూర్చుని ఉండగా సిఐడీ సిట్ అధికారులు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో రెండు సార్లు లిక్కర్ పాలసీపై జరిగిన చర్చల్లో మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్ లతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని సిట్ ప్రశ్నించారు. ఆదాన్ డిస్టిలరీ, డీకార్ట్ కు ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించారు. మిథున్ రెడ్డి ఎక్కువ వాటికి వైసీపీ ట్రేడ్ మార్క్ సమాధానాలు ఇచ్చారు. ఆధారాలతో సహా ఆయన ముందు కొన్ని పత్రాలు పెట్టి అడిగినా గుర్తు లేదు.. తెలియదు అని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ స్కాం వ్యవహారంలో పోలీసులు అన్ని ఆధారాలను ముందు పెట్టుకుని నిందితుల్ని విచారణకు పిలుస్తున్నారు. విచారణ మొత్తం రికార్డు చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా బుకాయిస్తున్నారని చెప్పేందుకు రికార్డు చేస్తున్నారు. మిథున్ రెడ్డిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాగానే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.