లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెడీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. అసలు ఆయనపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చేయలేదు. కేవలం ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చారంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నమోదు కాని కేసుకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టుకెళ్లారు.చివరికి ఎదురుదెబ్బ తిన్నారు.
ఏపీ లిక్కర్ స్కాంపై ప్రభుత్వం ఏ ఆలోచనలో ఉందో కానీ ఆ కేసు చాలా పెద్దదని మీడియాకు లీకులు వస్తున్నాయి. డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్లాయో కూడా తెలుసుకున్నారు. స్వయంగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు పార్లమెంట్ లో ప్రకటించారు కూడా. అలాగే కొన్ని లిక్కర్ కంపెనీలు వందల కిలోల బంగారాన్ని కొనుగోలు చేశాయని బయటపడింది. ఇలాంటి లెక్కలేనన్ని అక్రమాలు లిక్కర్ స్కాంలో జరిగాయని..ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరిగింది చాలా తక్కువ అని చెబుతున్నారు.
ఈ స్కాం వ్యవహారంలో అంతా కీలకంగా వ్యవహరించింది మిథున్ రెడ్డేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్పీవై కుటుంబానికి చెందిన కంపెనీని బలవంతంగా స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున లిక్కర్ తయారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎలా చూసినా ఇప్పటి వరకూ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చూపించలేదు. ఈడీ కూడా ఒకే సారి రంగంలోకి దిగేలా .. ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాకపోవడం ఆసక్తికరంగా మారింది. సీఐడీ తదుపరి చర్య ఎలా ఉంటుందన్న చర్చ ప్రారంభమయింది.