వైసీపీలో విజయసాయిరెడ్డి లేని లోటును తీర్చడం ఆ పార్టీ ముఖ్య నేతలకు అంత తేలిక కాదు. వైసీపీ అంటే ఢిల్లీలో విజయసాయిరెడ్డి అనే చెప్పుకుంటారు. అలా పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు. పార్టీ తరపున అధికారిక.. అనధికారిక సమావేశాల్లో ఆయనే పాల్గొనేవారు. అయితే ఇప్పుడు ఆయన రిటైరయ్యారు. ఎక్కడో హార్టికల్చర్ చేసుకుంటానని ఫోటోలు పెడుతున్నారు. రాజీనామా కూడా ఆమోదం పొందింది కాబట్టి ఢిల్లీలో కనిపించే చాన్స్ లేదు. ఇప్పుడు ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీసుకున్నట్లుగా ఉన్నారు.
పార్లమెంట్ సమావేశానికి ముందు ఆనవాయితీగా కేంద్రం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కు వైసీపీ తరుపన మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తాను ఏపీ కి రావాల్సినవి ఇవ్వాలని కోరానని పోలవరం గురించి ప్రస్తావించానన్నారు. నిజానికి గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గెలిచిన నలుగురు లోక్ సభ ఎంపీలు… మిగిలిన రాజ్యసభ ఎంపీలకు నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డిని ప్రకటించారు. లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని.. రాజ్యసభలో విజయసాయిరెడ్డిని ప్రకటించారు. ఈ ప్రకారం వైవీ సుబ్బారెడ్డి సమావేశానికి హాజరు కావాల్సి ఉంది.
కానీ వైవీ సుబ్బారెడ్డికి ఇలాంటి విషయాలపై పెద్దగా అవగాహన ఉండదని అనుకున్నారేమో కానీ మిథున్ రెడ్డి చార్జ్ తీసుకుని వెళ్లివచ్చారు. ఎవరు వెళ్లిపోయినా.. తర్వాత అదే సామాజికవర్గానికి చెందిన వారు ముందుకు వస్తారు కానీ.. జగన్ రెడ్డి చెప్పుకునే ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీలు మాత్రం ముందుకు రావడం లేదు.