పెళ్లికి అర్థం… అర్థం చేసుకోవడమే. ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. ఇది తెలిస్తే.. అన్ని కాపురాలూ సవ్యంగానే సాగుతాయి. ఈ మోడ్రన్ యుగంలో పెళ్లంటే డిపెండెన్సీ, లేదంటే శరీరంలో కోరికల్ని సంతృప్తిపరచడానికి పెద్దలు ఏర్పాటు చేసిన ఓ వ్యవస్థలe మారిపోయింది. చాలా జంటలు విడిపోవడానికి పెద్దగా కారణాలు కూడా అవసరం లేదు. పెళ్లంటే గౌరవం లేని చోట.. విడాకులకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడంలో ఈతరం ఎలా విఫలం అవుతుందో, ఎందుకు విఫలం అవుతుందో చెప్పే ప్రయత్నం ‘మిక్స్ అప్’లో చేశారు. ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ మూవీ ఇది. మరి… ఈ సినిమా ఎలా వుంది? ఈతరం దాపత్య జీవితాల్లోని గందరగోళాన్ని సరిగానే తెరపై ఆవిష్కరించారా?
అభి (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ) భార్యాభర్తలు. అభి చాలా సాఫ్ట్. భార్యని ప్రాణంగా ప్రేమిస్తాడు. నిక్కీ మాత్రం అలా కాదు. తను చాలా వైల్డ్. ఆఖరికి పడక మీద కూడా. తన శృంగారం కొంత హింసాత్మకంగా ఉంటుంది. దాన్ని అభి భరించలేడు. దాంతో సహజంగానే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. విడిపోవాలనుకొంటారు. సాహు (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజా జావేరీ) జంటది మరోకరమైన కథ. తనని సాహు అర్థం చేసుకోవడం లేదని మైథిలీ కంప్లైంట్. సెక్స్ అన్నది సాహు ఓ ఆబ్జెక్ట్ గానే చూస్తాడు. మైథిలికి అది నచ్చదు. సెక్స్‌లో కూడా ఎమోషన్ ఉండాలనుకొంటుంది. అందుకే ఇద్దరికీ మధ్య గొడవలు. వీళ్లకూ విడాకులే కావాలి. కౌన్సిలింగ్‌కు వెళ్తే.. ‘కొన్నిరోజులు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడిపి రండి.. పరిస్థితులు సర్దుకొంటాయి’ అని సలహా ఇస్తుంది. దాంతో ఈ రెండు జంటలూ గోవా వెళ్తాయి. అక్కడ ఏమైంది? వీళ్ల కాపురాలు సర్దుకొన్నాయా, మళ్లీ కలిసి జీవితం కొనసాగించారా? అనేది మిగిలిన కథ.
రెండు జంటల కథ ఇది. భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల్ని ఒకే ఫ్రేములో చూడొచ్చు. ఈ రెండు జంటల బాధల్లోనూ కొత్తగా కారణాలేం కనిపించవు. విడాకులు తీసుకొందాం అనుకొన్న ప్రతీ పది జంటల్లోనూ తొమ్మిది జంటల వ్యధ ఇదే కావొచ్చు. కాబట్టి.. ఈ కథలో కొత్తగా కనిపించే పాయింటేం ఉండదు. ఇంట్రడక్షన్ కోసం పెద్దగా టైమ్ తీసుకోకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. చిన్న చిన్న సన్నివేశాలతోనే ఈ రెండు జంటల బాధేమిటో చెప్పేశాడు. గోవాలో.. జరిగే డ్రామానే ఈ కథకు మలుపుని తీసుకొచ్చాయి. అక్కడ జంటల మార్పిడి.. దాని చుట్టూ నడిచే సన్నివేశాలు ఆసక్తికరంగానే ఉంటాయి. కాకపోతే.. తరవాత ఏం జరగబోతోందన్న విషయం ఊహకు అందేస్తుంటుంది. పెళ్లి, ప్రేమ, సెక్స్.. ఇలాంటి విషయాల గురించి యువతరం ఆలోచనా దృక్పథం ఎలా ఉందో కొన్ని సన్నివేశాలు చూస్తే అర్థమైపోతుంది. పార్టనర్‌ని సంతృప్తి పరచాలంటే సెక్స్ కావాలా? కాసేపు ప్రేమగా మాట్లాడితే సరిపోతుందా? అనే టాపిక్‌పై డిబేట్ నడిచినట్టు అనిపించాయి ఇంకొన్ని సన్నివేశాలు.
అభి, మైథిలీ క్యారెక్టర్లు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో.. సాహు, నిక్కీ క్యారెక్టర్లు అంత వైల్డ్ గా అనిపిస్తాయి. పరస్పర భిన్న ధృవాలు ఆకర్షించుకొంటాయి.. అనే సూత్రం పెళ్లికి మాత్రం వర్తించదన్న విషయం ఈ వెబ్ మూవీ చూస్తే అర్థం అవుతుంది. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. తాత్కాలిక ఆనందాల కోసం వెంటాడితే… జీవితంలో ఏం కోల్పోతామో, సంయమనం పాటిస్తూ, పార్టనర్‌కి తగిన గౌరవం ఇస్తే.. జీవితంలో ఏం అందుతుందో.. చెప్పడానికి ఈ రెండు జంటలూ ఉదాహరణలుగా నిలుస్తాయి.
నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ కథని నడిపించారు. కమల్, ఆదర్శ్ ఇద్దరూ తెలిసిన ఫేసులే కాబట్టి.. వాళ్లతో జర్నీ చేసేస్తాం. నలుగురూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. క్వాటిలీ మేకింగ్ అనేది కనిపించలేదు. రెండు పాటలు ఉన్నా రిజిస్టర్ కావు. వెబ్ మూవీ కాబట్టి.. సహజంగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొన్నాడో అది చెప్పాడు. ఏం తీయాలనుకొన్నాడో తీసేశాడు. కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉంటాయి. వాటిని భరించాల్సిందే. `ఫక్` లాంటి పదాలు చాలా సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. కేవలం 1 గంట 22 నిమిషాల సినిమా ఇది. కాబట్టి నిడివి పరంగా పెద్ద ఇబ్బందేం ఉండదు. భార్యాభర్తల మధ్య క్లాష్‌ని చాలా సహజంగా చూపించారు. కాకపోతే.. సినిమాటిక్ ఫీలింగ్ మాత్రం ‘మిక్స్ అప్’ ఇవ్వదు. ఏదో ఓ వెబ్ సిరీస్ లోని ఓ ఎపిసోడ్ చూస్తున్నట్టు ఉంటుంది. ఓటీటీలోనే ఉంది కాబట్టి, కాసేపు కాలక్షేపం కోసం ట్రై చేయొచ్చు. అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు.