ఆలయాలలో అర్చకుల నియామకాలపై సుప్రీం కోర్టు నిన్న ఇచ్చిన తీర్పు చాలా సంక్లిష్టం ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాలలో అర్చకుల నియామకాలు జరుపుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఎన్నో శతాబ్దాలుగా ఆగమ శాస్త్రం ప్రకారం అమలవుతున్న ఆలయ ఆచార వ్యవహరాలలో జోక్యం చేసుకోవడం అంటే మత స్వేచ్చకు భంగం కలిగించడమేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలపై సమస్యని బట్టి స్పందిస్తుంటామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కానీ ఆగమ శాస్త్ర ప్రకారం అన్నీ జరుగుతున్నపుడు అందులో తాము జోక్యం కలిగించుకోవలసిన అవసరం లేదని జస్టిస్ రాజన్ గగోయ్ మరియు ఎన్.వి. రమణలతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.
దేశంలో అనేక ఆలయాలలో ఆగమ శాస్త్ర ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని ప్రకారమే తిరుమల వంటి కొన్ని ప్రధాన ఆలయాలలో అనువంశికంగా అర్చకుల నియామకాలు జరుగుతున్నాయి. కానీ దాని వలన అటువంటి ఆలయాలలో అర్చకులుగా పనిచేయాలనుకొనే ఇతరులకు అవకాశం లేకుండాపోతోంది. గతంలో అంటే 1971లో తమిళనాడు డి.ఎం.కె. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వం హిందువులలో ఏ కులానికి చెందిన వారయినా సరే అర్చక వృత్తి చేపట్టేందుకు అవసరమయిన శిక్షణ పొంది, ఆలయాలు నిర్వహించే అర్చక పరీక్షలలో ఉత్తీర్ణులయితే ఆలయాలలో అర్చకులుగా జేరేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర దేవాదాయ చట్టంలో సవరణ చేసింది. దానిని వ్యతిరేకిస్తూ కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పుడు కూడా సుప్రీం కోర్టు వాటిపై ఇదేవిధంగా స్పందించింది. మళ్ళీ 2006లో మళ్ళీ నిన్న కూడా అదే విధంగా స్పందించింది. సుప్రీం కోర్టు తీర్పుపై రాజకీయ పార్టీలు, వివిద హిందు మత సంస్థలు భిన్నంగా స్పందిస్తున్నాయి. కొందరు దానిని స్వాగతిస్తుంటే మరి కొందరు తప్పు పడుతున్నారు.