హైదరాబాద్ లోని మియాపూర్ భూ కుంభకోణం ఇష్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా భాగస్వామ్యం ఉందంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ నేతలు మొదట్నుంచీ పట్టుబడుతున్నారు. తాజాగా కేంద్రంలోని పెద్దలకు ఇదే విషయమై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు టి. కాంగ్రెస్ నేతలు. కేంద్ర హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేద్దామనుకున్నారు. అయితే, అనూహ్యంగా అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో టి. కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని వీరు మరోసారి డిమాండ్ చేశారు. జాగీర్, ఇనామ్ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం… ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వారికి రిజిస్ట్రేషన్లు చేసి ధారాదత్తం చేయడంలో తెరాస అగ్రనేతల హస్తం ఉందని ఆరోపించారు.
ఇదే విషయమై హోం మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తుంటే తమతో మాట్లాడేందుకు ఆయన సుముఖంగా లేరని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రోజుకో కారణం చెబుతున్నారనీ, ఇప్పుడు ఆరోగ్యం బాలేదని అంటున్నారనీ, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఉత్తమ్ అన్నారు. ఆయనకి వీలు కానప్పుడు వారి సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేద్దామన్నా… అదీ వీలు కాదని అంటున్నారని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్న ఈ తరుణంలో కేంద్రంలోని భాజపా సర్కారు కూడా ఇలా ఎందుకు వ్యవహరిస్తోందని ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భూ కుంభకోణంపై సీబీఐ ఎంక్వయిరీ వేసేందుకు భాజపా సర్కారు ఎందుకు వెనకాడుతోందని ఉత్తమ్ నిలదీశారు. తెరాస, భాజపాల మధ్య కుదిరిన చీకటి ఒప్పందం ఇది కాదా అని ప్రశ్నించారు.
ఇదే అంశమై దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. ఈ కుంభకోణంలో తెరాసను కాపాడేందుకు భాజపా సిద్ధపడుతున్నట్టు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే… కేసీఆర్ సర్కారును ఈ వ్యవహారం నుంచి బయటపడేసేలా భాజపా పెద్దలు డీల్ కుదుర్చుకున్నారని డిగ్గీరాజా తీవ్రస్థాయిలో ఆరోపించారు. మొత్తానికి, మియాపూర్ భూ వ్యవహారాన్ని కేంద్రం మెడకు కూడా తగిలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి తెరాస మద్దతు వెనక ఉన్న రహస్య ఒప్పందం ఇదే అని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమే. దీనిపై కేంద్రంలో భాజపా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
నిజానికి, కాంగ్రెస్ ఆరోపణలపై రాష్ట్రంలోని తెరాస సర్కారు ఈ మధ్య కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేలా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ భూ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు కేసీఆర్ దగ్గరున్నాయనీ, వారిలో కాంగ్రెస్ నేతల పేర్లున్నాయనీ అన్నీ బయటకి వస్తాయని ఈ మధ్యే మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా భాజపాతోనే కేసీఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారంటూ కేసీఆర్ సర్కారుపై కాంగ్రెస్ భారీ ఎత్తున ఆరోపిస్తోంది. మరి, కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.