తనను అరెస్టు చేయాల్సి వస్తే అది రాజకీయం కారణంగానే అని చెప్పుకునేందుకు రోజా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అడ్డగోలుగా దోచేసినట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం చర్యలుతీసుకోవడం లేదంటే.. అరెస్టు చేసేందుకు సిద్దంగా లేదని అర్థమని.. అందుకే ఎంతయినా మాట్లాడుకోవచ్చని ఆమె ఫిక్సయ్యారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టిన తర్వాత ఆయన కన్నా రోజానే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె .. తన సినిమా హావభావాలతో దమ్ముంటే జైల్లో పెట్టమని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
గుంటూరు జిల్లా జైలు ముందు నిలబడి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వార్నింగ్ కన్నా రోజా ఇచ్చిన వార్నింగే కాస్త మెరుగ్గా ఉంది. అయితే జైల్లో పెట్టుకోండి అని సవాల్ చేస్తున్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఇతర నేతలు మాత్రం అంత పాజిటివ్ గా స్పందించలేదు. మహిళా నేత కాబట్టి అరెస్టు చేయరన్న ధీమాతో ఉన్నారని.. కానీ తమ సంగతేమిటని వారు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పటికే రోజుకో బాగోతం బయటపడుతోంది. నకిలీనెయ్యిలో దోచినదంతా కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో అని చెబుతున్నారు. తాజాగా రవికుమార్ అనే జీయర్ ఆశ్రమ ఉద్యోగి వ్యవహారంలోనూ ఆయన పేరే వినిపిస్తోంది.
రోజా పై విచారణ చేయదల్చుకుంటే ఒక్క తిరుమల దర్శనాలతోనే పూర్తిగా బుక్ చేయవచ్చు. ఆమె ప్రతీ వారం తిరుమల దర్శనానికి వెళ్లి తనతో పాటు ఓ యాభై మందిని తీసుకెళ్లేవారు. ఇలా టిక్కెట్లు అమ్ముకుని కోట్లు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఓ ట్రావెల్ ఏజెన్సీతోనూ ఇలా సంపాదించారని చెబుతున్నారు . ఈ మొత్తం బయటకు తీయడం పెద్ద విషయం కాదు. కానీ తీయడం లేదు కాబట్టి ఆమె బెదిరింపులు ప్రారంభించారు.