రాజకీయ నేతలు ప్రజల్ని పిచ్చోళ్లను చేయాలనుకుంటారు. ఓ భావోద్వేగంలో ముంచి తమ రాజకీయాన్ని తాము జోరుగా చేసి.. ఫలితాలు పొందాలనుకుంటారు. ఆ భావోద్వేగంలో ఉన్న వారికి అది అర్థం కాదు. కానీ బయట నుంచి చూసేవారికి ఇలా ఎలా చేయగలరన్న ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు తమిళనాడులో అదే జరుగుతోంది.
హిందీభాషను బలవంతంగా రుద్దుతున్నారని రచ్చ రచ్చ చేస్తున్న డీఎంకే.. తాజాగా రూపాయి సింబల్ ను తప్పించింది. తమ అధికారి బడ్జెట్ పత్రాల్లో దేశం మొత్తం అంగీకరించిన ప్రపంచం మొత్తం రూపాయి సింబల్‌ను తప్పించి తమిళ రూపాయలో మొదటి అక్షరాన్ని చేర్చింది. దాన్నే తాము సింబల్ గా భావిస్తామని చెబుతోంది. బడ్జెట్ పత్రాలను అలాగే సిద్దం చేసి శనివారం అసెంబ్లీకి సమర్పించనున్నారు.
అయితే స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఆ సింబల్ డిజైన్ చేసింది ఓ తమిళ యువకుడు. 2010 ఆ యువకుడు డిజైన్ చేసిన రూపాయి సింబల్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. డాలర్ తరహాలో రూపాయికీ ఓ సింబల్ ఉండాలని కేంద్రం పోటీలు పెట్టి ఈ సింబల్ ను ఎంపిక చేసింది. ఆ యువకుడు ఎవరో కాదు.. డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో ఆ యువకుడ్ని కరుణానిధి అభినందించారు కూడా. ఇప్పుడు రూపాయి సింబల్ హిందీలో ఉందని దాన్ని తీసేస్తామంటున్నారు స్టాలిన్.
స్టాలిన్ తమిళుల్ని అవమానిస్తున్నారని విమర్శలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు స్టుపిడ్ నిర్ణయం అన్నారు. హిందీ సంగతేమో కానీ ఈ నిర్ణయం స్టాలిన్ కు రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.