తమిళనాడులో ఎన్నికల వేడి తారాస్థాయికి వెళ్తోంది. వరుసగా రెండో సారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న స్టాలిన్ ప్రజల్ని ఓ సెంటిమెంట్ మైకంలో ఉంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ హిందీ ఉద్యమంతో ప్రజలందరి మనసుల్లో . మనపై హిందీతో ఉత్తరాది దాడి చేస్తోంది.. మన భాష పీక నొక్కుతోందన్న సెంటిమెంట్ నింపడంలో బిజీగా ఉన్న ఆయన తాజాగా దక్షిణాది సెంటిమెంట్ ను కూడా అంది పుచ్చుకోవాలనుకుంటున్నారు.
దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని. నియోజకవర్గాల పునర్విభజనలో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నష్టం జరగకుండా ఉండాలంటే అందరం కలిసి పోరాడాలని దక్షిణాది రాష్ట్రాల పాలకులకు.. ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిస్తున్నారు. 22వ తేదీన చెన్నైలో సమావేశమవుదాం రమ్మని ఆయన ఆహ్వానాలు పంపారు. కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్లుకు పంపారు. రేవంత్ రెడ్డి కూడా అదే వాదన వినిపిస్తున్నందున హాజరు కావొచ్చు కానీ కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదు. కేటీఆర్ కూడా హాజరు కాకపోవచ్చు. బీజేపీకి కోపం వస్తుంది. విచిత్రంగా ఆయన కూడా దక్షిణాదికి అన్యాయం వాదన వినిపిస్తున్నారు. రేవంత్ హాజరవుతున్నందున తాము రామని చెప్పే అవకాశం ఉంది.
ఇక ఎన్డీఏలో భాగంగా ఉన్నందున చంద్రబాబు వెళ్లరు. జగన్ కు కూడా అంత ధైర్యం లేదు. ఆయన బీజేపీని ఒక్క మాట అనే పరిస్థితుల్లో లేరు. కేరళ నుంచి కమ్యూనిస్టులు వస్తారు. అయినా.. దక్షిణాది రాష్ట్రాలు.. తమ తమ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు.. ఈ టాపిక్ హైలెట్ చేస్తూంటాయి. గతంలో కేసీఆర్, చంద్రబాబు, కేరళ పార్టీలు కూడా ఇలాంటి లేఖలు రాశాయి. కానీ ఎవరూ తర్వాత అడుగుపై ఆలోచన చేయలేదు.