మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఓ విత్తన కంపెనీ చేతిలో బకరా అయ్యారు. అది ప్రైవేటు కంపెనీ అయితే ఎలాగోలా రాజకీయం చేయవచ్చు .. కానీ ఏపీ ప్రభుత్వ అధీనలో ఉన్న ఏపీ సీడ్స్ చేతిలో ఆయన బకరా అయ్యారు. ఆ కథపై ఇప్పుడు ఏపీలో రచ్చబండ మీద చర్చ అవుతోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయం చేస్తారు .. అలాగే అప్పుడప్పుడూ వ్యవసాయం చేస్తారు. ఎడ్లు లేనట్లుగా.. ట్రాక్టర్ లేనట్లుగా.. ఆయనే కాడి భుజాన వేసుకుని దున్నుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ దర్శనమిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే.. ఆయన వ్యవసాయం కూడా చేస్తారని అనుకోవాలి. గుంటూరు శివారులో ఓ గ్రామంలో తనకు ఉన్న పధ్నాలుగు ఎకరాల పొలంలో ఆయన వరి పంట వేశారు. ఇందులో వరి కంకులు రాలేదు. దీంతో తాను నష్టపోయానంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధికారులు కూడా హుటాహుటిన స్పందించారు. ఆయన పొలాన్ని పరిశీలించారు. మొలకలు వచ్చినా.. గింజలు రాలేదని.. గుర్తించారు. వెంటనే.. చర్యలకు ఉపక్రమించారు. విషయం ఏమిటంటే.. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ సీడ్స్… ఈ విత్తనాలు స్వయంగా సిద్ధం చేయలేదు. ఇతర ప్రైవేటుకంపెనీల నుంచే సేకరిస్తుంది. అలా…ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనుగోలు చేసిన.. విత్తనాలను నంద్యాలకు చెందిన మంజీరా సీడ్స్ అనే కంపెనీ సరఫరా చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు తన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ తీరుపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇప్పటి వరకూ ఏపీ సీడ్స్ నుంచి ఆ కంపెనీ విత్తనాలను కొనుగోలు చేసిన రైతులెవరూ.. తమకు నకిలీ విత్తనాలు సరఫరా చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా… ఎక్కడా బయటకు రాలేదు. ఒక్క ఆళ్లకు మాత్రమే నకిలీ విత్తనాలు వచ్చాయా..? లేక రైతులందర్నీ అంతే ముంచారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఒక వేళ ఆళ్లకే అలాంటి పరిస్థితి వస్తే.. బహుశా.. ఆ మంజీరా సీడ్స్ అనే కంపెనీ… ఏ టీడీపీ నేతకో.. లేదా ఆ పార్టీ సానుభూతిపరుడికో చెందినది అయి ఉండవచ్చని.. అనుకోచవచ్ని.. కొంత మంది సెటైర్లు కూడా ప్రారంభించారు.