తెలుగుదేశం శాసనసభ్యురాలు అనిత చురుకుతనం, చర్చలో జోక్యం బాగున్నాయని పేరు వచ్చింది. అయితే ఆమె అత్యుత్సాహంలో పడ్డారా అని కూడా సందేహం కలుగుతుంది. వైసీపీ సభ్యురాలు రోజా ఆమెను అవమానించేలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. అది ఆమెకు సంతృప్తి కలిగించాలట కూడా. నిజానికి అంటున్నది రోజాను అనుకుంటున్నా పదేపదే ఈ విధమైన వాదోపవాదాలు జరగడం స్త్రీలందరికీ చిన్నతనంగానే వుంది. అయితే అనితకు ఆ క్షమాపణ సరిపోనట్టు ఈ రోజు మరో కొత్త క్షమాపణ కోరారు. దళితులకు ఉచిత విద్యుత్‌పై మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ముష్టి వేసినట్టు 52 కోట్లు ఖర్చు చేసి అదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లక్ష కోట్లు వున్నాయి గనక నీకు ఇదో మొత్తం కాకపోవచ్చని మంత్రి అచ్చెం నాయుడు అంటించారు.అయితే అనిత మరో అడుగు ముందుకేసి ఇది దళితులను అవమానించడమేనని ఆరోపించారు. దళితులన్న మాటతో పాటు ముష్టి అనడం తప్పన్నారు.
శాసనసభ తొలి సమావేశాలలోనే ఇలా అన్నందుకు జగన్ క్షమాపణ చెప్పాలని వింత వాదన చేశారు. సహజంగానే పాలక పక్షం కూడా ఈ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. జగన్ అసలే స్పందించలేదు. పార్టీలు కాస్త చురుగ్గా వుండేవారిని ప్రోత్సహించడంతో పాటు వారితో ఎదటివారిపై దాడి చేయిస్తుంటాయి. అందుకే అధికార ప్రతినిధులుగా మహిళలను ఎస్సీలను ఎక్కువగా నియమిస్తుంటారు. వారినేమైనా అంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయి గనక అందరూ జాగ్రత్తగా వుంటారు. అయితే అంతమాత్రాన వారిని చిరకాలం నెత్తిన పెట్టుకోవడం జరగదు. అవసరం వస్తే ముందు వారినే బలిపశువులను కూడా చేస్తారు. కాబట్టి అనిత ఈ రోజటి పరిస్థితిని మాత్రమే చూసి సమయం సందర్భం లేకుండా రెచ్చిపోతుంటే స్వపక్షంలోనే నిరసన రావచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.