ఎమ్మెల్యేలు.. మంత్రులు.. వాళ్ల కుటుంబీకులు ఎవరైనా సరే.. కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే చెప్పారు. అయినా , కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబీకుల తీరు మాత్రం మారడం లేదు.
నా భార్య ఎమ్మెల్యే..నేను కోరినట్లుగా నాలుగు ఎకరాలు 30 లక్షలకు అమ్మేయ్..లేదంటే తర్వాతి పరిణామాలు సీరియస్ గా ఉంటాయని గుంటూర్ వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త , భ్రమరా టౌన్షిప్ అధినేత గళ్లా రామచంద్రరావు బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే భర్త నుంచి తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే భర్త వ్యవహారశైలి టీడీపీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
పీసపాడుకు చెందిన కమ్మ వెంకట్రావుకు పిడిగురాళ్ళ సమీపంలో ఎనిమిది ఎకరాల పొలం ఉండగా ..అందులో 4. 90 ఎకరాల భూమిని కొనేందుకు ఎమ్మెల్యే భర్త గళ్లా రామచంద్రరావు గతేడాది అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎకరం 48 లక్షల చొప్పున పొలాన్ని కొనేందుకు ఒప్పందం కుదుర్చుకోగా..23లక్షలు మాత్రమే ఇచ్చాడని వెంకట్రావు తెలిపారు. మొత్తం చెల్లించకుండా తన పొలంలో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. చేసేదేం లేక ఆ తర్వాత 4.90 ఎకరాలకుగాను 3.90 ఎకరాలకు పూర్తి సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు.
ఇక , రామచంద్రరావు భార్య ఎమెల్యేగా ఎన్నిక కావడంతో బెదిరింపులు షురూ చేశారని.. 30 లక్షలు తీసుకొని మిగిలిన నాలుగు ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరిస్తున్నారని వెంకట్రావు వాపోయారు. అందుకు నిరాకరించడంతో గళ్లా వెంకట్రావు అనుచరులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. రామచంద్రారావు బర్త్ డే సందర్భంగా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తావా? లేదా అని బెదిరించినట్లు చెప్పారు. 4 రోజుల కిందట తన కుమారుడు హరికృష్ణతో కలిసి బయటకు వెళ్లి వస్తుండగా బైక్పై వచ్చి ఢీ కొట్టారన్నారు. దీంతో ఎమ్మెల్యే భర్తతో తనకు ప్రాణ హాని ఉందని వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాదరణ కల్గిన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటే..కొంతమంది కూటమి ఎమ్మెల్యేల కుటుంబీకుల వ్యవహారశైలి సర్కార్ కు చిక్కులు తెచ్చి పెడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.