తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. బుధవారం చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులో ల్యాండయినప్పుడు స్వాగతం చెప్పడానికి వచ్చిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. శ్రీకాకుళం పర్యటనలో పాల్గొనలేదు. ఆయనది ఆ జిల్లా కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు…కానీ చంద్రబాబు విశాఖలో కార్యకర్తల సమావేశం పెడితే మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన తీరుపై టీడీపీలో భిన్న చర్చ జరుగుతోంది.
గంటా శ్రీనివారావు పార్టీ వీడుతారని చాలా కాలం చర్చ జరిగింది. కానీ ఆయన వెళ్లలేదు. ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని చెబుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలను మాత్రం నిర్వహించడం లేదు. ఆయన సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి మెరుగుపడటంతో ఆయన పార్టీలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఇతర నేతలు మాత్రం ఏకమవుతున్నారు.
ఇంత కాలం తాము ప్రభుత్వాన్ని ఎదుర్కొని కేసులకు భయపడకుండా పోరాడుతూంటే.. సైలెంట్‌గా ఇంట్లో కూర్చుని బురదపాముల్లా ఇప్పుడు కొంత మంది బయటకు వస్తున్నారని అయన్నపాత్రుడు లాంటి వారు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా పార్టీ కోసం పని చేయని వారికి ప్రాధాన్యం ఇవ్వనని చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వచ్చినా గంటా సమావేశానికి హాజరు కాకపోవడం టీడీపీలో మరోసారి భిన్నమైన చర్చలకు కారణం అవుతోంది.