జంపింగ్ జపాంగ్స్, బఫూన్స్, విలువలు లేనివాళ్ళు, క్యారెక్టర్ లేని ప్రజాప్రతినిధులు మనదగ్గర చాలా మందే ఉన్నారు. పార్టీలు మారడమనేది వాళ్ళకు డ్రెస్‌లు మార్చినంత ఈజీ. అప్పటి వరకూ పొగిడిన పార్టీ అధినేతను…పార్టీ మారిన వెంటనే పిచ్చి తిట్లు తిట్టగలరు. అలాగే అన్ని పార్టీల నాయకుల చేత కూడా తిట్టించుకుంటూ ఉంటారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి నాయకుల్లో ఎక్కువ మందికి ఎప్పుడూ ఏదో ఒక పదవి ఉండడం, లేకపోతే కొత్తగా చేరిన పార్టీలో కూడా వాళ్ళకే ప్రాముఖ్యత దక్కుతూ ఉండడం. ‘పెద్దాయన…పెద్దాయన’ పాటతో బొత్సను విలన్ని చేసిన జగన్…ఇప్పుడు బొత్సకు వైసిపిలో ఇస్తున్న ప్రాధాన్యత చూసి వైసిపి నేతలే కోప్పడుతున్నారు. ఇక పరిటాల రవి మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా పాపులర్ అయిన జెసి దివాకర్‌రెడ్డి…ఇప్పుడు చంద్రబాబుకు సన్నిహితుడు అయిపోవడంతో పరిటాల సునీత బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి నాయకులు ఇంకా చాలా మందే ఉన్నారు.
చంద్రబాబు ఓల్డ్…నేను న్యూ ఏజ్ పొలిటీషియన్ని అని చెప్పుకునే జగన్ ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్‌కి తెరతీసేలానే కనిపిస్తున్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకూ టిడిపిలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు కొంతంమంది ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అంటే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు అంటూ తన యాత్రల్లో భాగంగా మాట్లాడిన ప్రతిస్పీచ్లోనూ తిట్టిపోసిన ఎమ్మెల్యేలను ఇప్పుడు మళ్ళీ వైసిపిలో చేర్చుకునే ప్రయత్నాల్లో జగన్ ఉన్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. జగన్ మీడియాలోనే ఇలాంటి వార్తలు వస్తూ ఉండడంతో జంపింగ్ జపాంగ్స్ని మళ్ళీ పార్టీలో చేర్చుకోవడానికి జగన్ కూడా సుముఖంగా ఉన్నాడని అనుకోవాల్సి వస్తోంది. ఒకసారి అమ్ముడుపోవడానికి అలవాటైన నేతకు ఇక పార్టీలు, సిద్ధాంతాలు లాంటి మాటలు చెప్పే అర్హత ఉంటుందంటే నమ్మలేం. అంటే అప్పుడు చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఇప్పుడు జగన్ తిరిగి కొంటున్నాడని అనుకోవాలా? జంపింగ్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయిస్తా అంటూ ఢిల్లీ చుట్టూ కూడా తిరిగిన జగన్ ఇప్పుడు ఆ జంపింగ్ ఎమ్మెల్యేలను వైసిపిలో చేర్చుకుంటే ప్రజలకు ఏమని సమాధానం చెప్తాడు? వైసిపిలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు యూటర్న్ జంప్ చేస్తారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో కొత్త ట్రెండ్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఏంటో మన నాయకులు……పొద్దస్తమానం విలువలు, విశ్వసనీయత అంటూ మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు……చేతలు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. మనవాళ్ళు చేసే అతిపెద్ద ‘రాజకీయం’ ఇదే.