హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ ఇవాళ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే గన్ మ్యాన్ రవీందర్ తుపాకీని పక్కన పెట్టినపుడు అక్బర్ తీసుకుని పరిశీలిస్తుండగా అది మిస్ ఫైర్ అయ్యిందని చెబుతున్నారు. బుల్లెట్లు అక్బర్ తలలోకి దూసుకెళ్ళిపోతుండటంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అక్బర్ మహబూబ్ నగర్ జిల్లా చౌదరిపల్లె గ్రామానికి చెందినవాడని తెలిసింది. మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అక్బర్ తుపాకి ప్రమాదవశాత్తూ పేలి చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అక్బర్ మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు. అతని కుటుంబసభ్యులు మాత్రం దీనివెనక ఏదో మిస్టరీ ఉందని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎమ్మెల్యే గన్‌మ్యాన్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.