చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్ అల్వాల్ లోని ఇంట్లో ఉరేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రమే ఈ ఘటన చోటుచేసుకున్నా అర్దరాత్రి ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రూపాదేవి రెండు రోజులుగా స్కూల్ కు కూడా వెళ్ళడం లేదు. గురువారం ఉదయమే ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గ పర్యటనకు వెళ్ళగా… సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
అయితే, దంపతుల మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నాయని…ఈ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమోదు చేసుకొని రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలను ఎంక్వైరీ చేస్తున్నారు.