తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
మనకు తెలియన్నా తెలియాలి. లేదా సరైన దోవన వెళ్తున్నవాడిని చూసి అన్నా నేర్చుకోవాలి. ఈ సూక్తి సినిమా జనాలకు కూడా వర్తిస్తుంది. భారీ సినిమాలు, మాస్ సినిమాలు, ఫార్ములా సినిమాలు పెద్ద హీరోలకే పరిమితం. చిన్న, మీడియం హీరోలు, కొత్త డైరక్టర్లు, వైవిధ్యమైన బాటను వెదుక్కోవాల్సిందే. టాలీవుడ్ లో ఇప్పుడు జరుగుతున్నది అదే. వస్తున్న ఒక్కో కొత్త డైరక్టర్ ఒక్కో కొత్తదనం చూపిస్తున్నాడు. అలాంటి టైమ్ లో ఓ కొత్త డైరక్టర్ వచ్చి, మీడియం రేంజ్ హీరోతో రొటీన్ ఫార్ములా సినిమా తీసి చూపిస్తే? ఏమంటారు?
రొటీన్, రొడ్డ కొట్టుడు అనే కదా? కానీ నిర్మాతలేం అంటారు. మంచి క్వాలిటీ మేకింగ్ వుంది. పాటలు వున్నాయి. కలర్ ఫుల్ గా తీసాం. మంచి మెసేజ్ ఇచ్చాం అనే కదా? కానీ అవన్నీ కలిసి ఎవరితో చేసారు? అన్నది టాలీవుడ్ లో కీలకమైన పాయింట్. కమర్షియల్ సినిమాలు పెద్ద హీరోలే చేయాలి. సందేశాలు వాళ్లే ఇవ్వాలి. రొటీన్ సినిమాలు పెద్ద డైరక్టర్ లే చేయాలి. కొత్ దర్శకులు, చిన్న మీడియం హీరోలు వైవిధ్యంగా ఆలోచించాలి.
సో, ఇందుమూలముగా తెలియచేయునది ఏమనగా? ఎమ్మెల్యే సినిమా సగటు వాణిజ్య చిత్రము. లక్షణాలు మంచివే కానీ, కళ్యాణ్ రామ్ లాంటి హీరోకు సూటయ్యేవి కావు. కళ్యాణ్ రామ్ బుద్దిగా థ్రిల్లర్లో, లేదా ఫన్ ఎంటర్ టైనర్ లో చేసుకోవాలి. అనవసరపు హ్యూమన్ ఎమోషన్లు, సందేశాల జోలికి పోరాదు.
ఎమ్ ఎల్ ఎ. మంచి లక్షణాలున్న అబ్బాయి. టైటిల్ బాగుంది. ఇంతకీ ఇంత మంచి లక్షణాలున్న అబ్బాయి ఏం చేసాడు. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి? ఆ ప్రేమ కోసం ఆమె ఊరికి వచ్చాడు. ఆ ప్రేమ కోసం ఆ ఊరిని మార్చాడు. ఊరి జనాలను మార్చాడు. వాళ్ల మనసుల్ని గెలిచి నిజంగా ఎమ్మెల్యే అనిపించుకున్నాడు. వాళ్ల పాలిట శతృవును నాశనం చేసాడు.
ఇదేంటీ..ఇదేదో శ్రీమంతుడు కథలా వుంది అనుకోవద్దు. ఒకే లైన్ ను ఎన్నివిధాలుగా అయినా మార్చుకోవచ్చు. ఇదో తరహా.
కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) సరదా కుర్రాడు. చెల్లెలి పెళ్లి తను ప్రేమించిన కుర్రాడితో (వెన్నెల కిషోర్) చేసి, అతనితో పాటు బెంగుళూరు వెళ్లి ఓ కంపెనీలో చేరుతాడు, అక్కడ పరిచయం అవుతుంది ఇందు (కాజల్). ఆమెను ప్రేమిస్తే, ఆమె వెనుక ఓ విషాదం వుందని తెలుస్తుంది. అదేమిటంటే, తన కుటుంబానికి ఓ ఎమ్మెల్యే వుండాలనే పిచ్చితో, ఆమె తండ్రి, ఇందును స్థానిక ఎమ్మెల్యే (రవికిషన్)కు ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. కాదు తాను ప్రేమించానని కళ్యాణ్ అంటే, అయితే నువ్వు ఎమ్మేల్యే కా అంటూ ఆఫర్ ఇస్తాడు. అప్పుడు కళ్యాణ్ ఏం చేసాడు అన్నది మిగిలిన సినిమా.
ఎమ్ ఎల్ ఎ సినిమాలో మూడు భాగాలు వున్నాయి. ఒకటి హీరొయిన్ పరిచయం కావడం అందుకోసం హీరో బంగళూరు వెళ్లడం, అలా వెళ్లడానికి చెల్లి పెళ్లి నేఫథ్యం కావడం, ఇదంతా ఒకటి. ప్రేమించిన అమ్మాయి అసలు సమస్య తెలియడం, ఆమె ఊరికి వెళ్తే, ఎమ్మేల్యే కావాలన్న కండిషన్. దానికోసం కామెడీగా ట్రయ్ చేయడం ఇది రెండోది. ఇక ముచ్చటగా మూడోది. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని తీర్చి, వాళ్లకు దగ్గరై ఎమ్మెల్యే కావడం.
ఇంధులో ఒక విషయం విశ్రాంతికి ముందు, మరో రెండు విశ్రాంతి తరువాత అన్నట్లు విడదీసారు. అంటే విశ్రాంతి ముందు అబ్బాయి బంగళూరు వెళ్లడం, అమ్మాయి పరిచయం కావడం, ఫ్లాష్ బ్యాక్ తెలియడం మాత్రమే. అసలు కథ అయిన ఎమ్మెల్యే కావలన్నషరతు, ప్రయత్నాలు, జనాల సమస్యలు, సందేశం, అన్నీ ద్వితీయార్థంలో.
ఎప్పుడైతే ప్రథమార్థంలో అసలు పాయింట్ తక్కువ అయిందో దానికి ప్యాడింగ్ గా పోసాని ఎపిసోడ్, పాటలు, ఫన్ జోడించుకున్నారు. వీటిలో పాటలు నడకకు అడ్డం పడినా, పోసాని ఎపిసోడ్ బి సి సెంటర్లలో క్లిక్ అవుతుంది. అందువల్ల పెద్దగా ఫస్ట్ హాఫ్ సమస్యగా వుండదు.
కానీ ఎప్పుడైతే కథ అంతా ద్వితీయార్థంలో వుందో, ఫస్ట్ హాఫ్ మొత్తం, సెపరేట్ అయిపోతుంది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని అయిదు నిమషాల్లోకి మార్చేసి, ద్వితీయార్థం జోడించినా సరిపోతుంది కదా అనిపిస్తుంది. అయితే ఫన్ కోసం దర్శకుడు ఫస్ట్ హాఫ్ ను వాడుకున్నాడు అని సరిపెట్టుకోవాలి. ఒక్క అజయ్ ఇంటి ఎపిసోడ్ కోసమే బోలెడు టైమ్ తీసుకున్నాడు. సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండానే. పైగా అదంతా దర్శకుడి గురువు శ్రీనువైట్లను గుర్తుకు తెస్తుంది.
సరే, ఏదో సరదా, సరదాగా ఫస్ట్ హాప్ గడచిపోయిందిలే అనుకుంటే ద్వితీయార్థం లో ఇలాగే సరదాగా ప్రారంభించి, సీరియస్ టర్న తీసుకున్నాడు. ఆ తీసుకోవడం తీసుకోవడం ముగిసే వరకు అదే లైన్ లో సాగిపోయాడు. దాంతో రెండు మూడు రకాల సినిమాలు కలిసి చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
మరోపక్క దర్శకుడు హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ ను సరిగ్గా పండించలేకపోయాడు. ఆ మాటకు వస్తే కళ్యాణ్ రామ్ కు ఏ హీరోయిన్ తో కూడా కెమిస్ట్రీ అంతగా పండదేమో అనిపిస్తుంది. కాజల్ కు అతనికి మధ్య అతుకు అస్సలు సరిపోలేదనే చెప్పాలి. అందుకే కలర్ ఫుల్ చిత్రీకరణ, హీరో హీరోయిన్ల ఇద్దరూ బాగానే వున్నా, మ్యూజిక్ ఫరవాలేదని అనిపించినా, ఒక్క పాట కూడా సినిమాలో రక్తి కట్టలేదు. పైగా రాంగ్ ప్లేస్ మెంట్ అనిపిస్తుంది.
సినిమాకు అదృష్టం ఏమిటంటే ఫస్ట్ హాఫ్ ఫన్ బాగానే పండింది. పోసాని, వెన్నెల కిషోర్ ఒకె. కానీ బహ్రానందం ఎపిసోడ్ ఓవర్ అనిపించింది. బిల్డప్ ఎక్కువ. అసలు తక్కువ. ద్వితీయార్థంలో పృధ్వీని, ప్రభాస్ శ్రీనును వాడుకున్నది తక్కువ. వీళ్లను కూడా కాస్త వాడుకునేలా సీన్లు రాసుకుని, ద్వితీయార్థంలో అక్కరలేని సందేశాలను, ఎమోషన్లను కాస్త తగ్గించి వుంటే ఈ హీరోకి, ఈ జోనర్ కు సరిపోయేది. కానీ ఓ పెద్ద హీరోతో, పెద్ద డైరక్టర్ సినిమా చేస్తున్న భావనలోకి వెళ్లి పోవడంతో కథ ఇలా తయారంది, హీరోయిన్ తాను అక్కడే వున్నాను అని గుర్తు చేయడానికి అన్నట్లు అప్పుడు అప్పుడు కనిపించి మాయం అవుతూ వుంటుంది. అన్ని సినిమాల్లో విలన్ లాగే, ఈ సినిమాలో కూడా భారీ బిల్డప్ ఇచ్చిన విలన్, పక్కా జోకర్ లా బిహేవ్ చేస్తాడు మిగిలిన సినిమా అంతా.
రెండుమూడు సినిమాలు కలిపిన కథ, అనేక సినిమాల్లో చూసిన స్క్రీన్ ప్లే, సన్నివేశాలు కలిపి కొట్టడం, ఈమధ్య వస్తున్న చాలా సినిమాల్లో కనిపించే వైవిధ్యం లేకపోవడం, అన్నీ కలిసి ఎమ్మెల్యే సినిమాను ఓ జస్ట్ పాస్ ఆన్ సినిమాగా మార్చేసాయి.
సినిమా కోసం బాగానే ఖర్చు చేసారు. సాంకేతిక విలువలు అన్నీ బాగున్నాయి. మంచి సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, లోకేషన్లు అన్నీ బాగున్నాయి. కళ్యాణ్ రామ్ కాస్త కొత్తగా కనిపించాడు. వయసు బాగానే దాచగలిగాడు. కానీ ఆ డ్యాన్స్ లు అతనికి అంతగా నప్పలేదు. యాక్షన్ సీన్లు బాగున్నాయి. కొత్త దర్శకుడైనా టేకింగ్ బాగానే వుంది. కమర్షియల్ టేకింగ్ పై పట్టు వుంది అని తెలుస్తోంది. సీన్లు ఎత్తుకోవడం, కెమేరా యాంగిల్స్, ఇవన్నీ దర్శకుడు ఉపేంద్ర మాధవ్ కు వున్న అనుభవాన్ని చెప్పకనే చెప్పాయి. ఎక్కడా తడబాటు కనిపించలేదు. కానీ అసలు ఈ సినిమా ఇలా అటెంప్ట్ చేయడమే రాంగ్ డెసిషన్.
తీర్పు
ఎవరు తీసే సినిమా, ఎవరు చేసే సినిమా అన్నది టాలీవుడ్ లో క్లియర్ గా వుంది. అదంతా కనపడని రాజ్యాంగం. దాన్ని దాటి వెళ్తే ఫలితాలు తేడాగా వుంటాయి. చిన్న, మీడియం హీరోలు అయితే థ్రిల్లర్లు చేయాలి. లేదా కామెడీ చేయాలి. అంతే కానీ సందేశాలు, సూక్తులు వల్లించకూడదు. వాటిమీద పేటెంట్ రైట్స్ పెద్ద హీరోలకు, డైరక్టర్లకు మాత్రమే.
ఫినిషింగ్ టచ్
మినిమమ్ లెవెల్ అబ్బాయి
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5